సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సహావేశహాల్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావుతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా సూచించారు. సమావేశంలో ఆర్‌డీఓ నవీన్, డీఆర్‌డీఓ నర్సింహులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కామన్ మెనూ అమలు చేయాలి
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ మెనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భోజనంలో తాజా కూరగాయల వినియోగంతో పాటు వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. బాలికల భద్రతకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యకు తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, పాల్గొన్నారు
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పలు అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపాల్ అమీనా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో తెలుగు, జువాలజీ, డిగ్రీలో పొలిటికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 9వ తేదీలోగా ఽకళాశాలలో పూర్తి సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పోలీసు సేవలు
వినియోగించుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ సేవలను ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎలాంటి భయాందోళనలు, మధ్యవర్తుల సహాయం లేకుండా స్టేషన్‌కు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది బాధితుల నుంచి సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. అనంతరం సదరు పోలీస్‌స్టేషన్ అధికారితో ఫోన్ మాట్లాడి సకాలంలో స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
ట్రాఫిక్ దారి మళ్లింపు..
ఈ నెల 8 నుంచి 11 వరకు పట్టణంలోని టీడీగుట్ట రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో నాలుగు రోజుల పాటు టీడీగుట్ట రైల్వేగేట్ మూతపడి ఉండటం వల్ల ట్రాఫిక్ దారి మళ్లింపు ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. తాండూర్, కోస్గి, హన్వాడ, కోయిలకొండ వైపు వెళ్లే వాహనాలు కలెక్టర్ బంగ్లా బ్రిడ్జి మీద నుంచి వెళ్లాలని సూచించారు. దీన్ని ప్రతి వాహనదారుడు గమనించాలని, ఈ ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు.
కందులు @ రూ.7,611
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో సోమవారం కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,611, కనిష్టంగా రూ.4,601 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,709, కనిష్టంగా రూ.4,537, రాగులు రూ.2,473, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,469, కనిష్టంగా రూ.2,280, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,619, కనిష్టంగా రూ.1,836, హంస రూ.1,801, మినుములు రూ.7,870 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా రూ.7,459, కనిష్టంగా రూ.6,802 పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment