తహసీల్దార్ కార్యాలయంలో.. రైతు ఆత్మహత్యాయత్నం
దేవరకద్ర రూరల్: తన పట్టా పొలంలో అక్రమంగా వేస్తున్న రోడ్డు పనులను నిలిపివేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన సంఘటన సోమవారం దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రామకృష్ణకు గ్రామంలోని సర్వే నం.88లో 6.6 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో నుంచి పై పొలాలకు వెళ్లేందుకు తన అనుమతి లేకుండా దారి కోసమని కొందరు మట్టి రోడ్డు వేస్తున్నారని, అడిగిన తనపై దాడి చేశారని, ఈ విషయమై పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే సోమవారం బాధిత రైతు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. దీంతో న్యాయం కోసం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ విషయమై స్పందించిన తహసీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి ఇప్పటి వరకు రాలేదని, మోకపైకి వచ్చి పూర్తి వివరాలు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment