డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలి
మహబూబ్‌నగర్ రూరల్: మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని క్రిష్టియన్‌పల్లి రెవెన్యూ శివారు సర్వే నం.523లో తమ ఇంటి స్థలాలు, పట్టా సర్టిఫికెట్లు 2018 సంవత్సరంలో ప్రభుత్వానికి స్వాధీనపరిచిన వారు తక్షణమే తమకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా అనర్హులకు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేస్తారని బాధితులు సంబరపడ్డారని, కానీ, ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి అవినీతిపరులుగా ముద్రపడిన నాయకులు, కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడం వల్ల తమకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇంటి స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుందని, ఇల్లు గాని, ఇంటి స్థలం గాని లేని పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలో ప్రభుత్వ భూమి వివరాలు తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఘాన్సీరాంనాయక్, డిప్యూటీ తహసీల్దార్ దేవేందర్‌లను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీపీజేఏసీ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, టీఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, కార్యదర్శి యాదగిరి, నాయకులు జలాల్‌పాషా, గట్టన్న, జైపాల్, బాలకృష్ణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్నిముట్టడించిన సర్వే నం.523 బాధితులు
Comments
Please login to add a commentAdd a comment