గ్రామసభలకు పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సంక్షేమ పథకాల అమలులో భాగంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించనున్న గ్రామసభలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతుందని, ఇందులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలలో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామన్నారు. గ్రామసభలలో ఫ్లెక్సీలు, తాగునీళ్లు, టెంట్లు, మైక్ సెట్ ఏర్పాటు చేయాలన్నా. అలాగే వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేస్తామన్నారు. గ్రామసభల నిర్వహణపై ముందురోజు గ్రామంలో టాంటాం వేయించాలన్నారు. నాలుగు సంక్షేమ పథకాల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక రిజష్టర్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్, సెల్‌నంబర్లు తీసుకోవాలని సూచించారు.
గణతంత్ర వేడుకలపై సమీక్ష
ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా జరిగేలా చూడాలన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు జాబితా రూపొందించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, ఆర్డీఓ నవీన్, హౌజింగ్ పీడీ వైద్యం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment