ఇద్దరి చిన్నారుల ప్రాణం తీసిన నీటిగుంత
జడ్చర్ల: తల్లి పొలం పనుల్లో నిమగ్నమవగా.. ఆడుకుంటూ వెళ్లిన వారి ఇద్దరు చిన్నారులు రిజర్వాయర్ నీటి గుంతలో పడి దుర్మరణం పాలయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్, పార్వతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు భార్గవి హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంది. ఇక చిన్న కూతురు భాగ్యలక్ష్మి(6), కుమారుడు మహేశ్(4) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. శనివారం తల్లి పార్వతమ్మ తన ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని వ్యవసాయ పొలం వద్దకు చేరుకుని పనుల్లో నిమగ్నమయ్యింది. అక్కాతమ్ముడు ఆడుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న నీటి గుంత వెంబడి వెళ్తూ ప్రమాదవశాత్తు జారీపడ్డారు. కొద్దిసేపటి తర్వాత తల్లి పార్వతమ్మ పిల్లల కోసం గాలించగా నీటి మడుగులో కూతురు మృతదేహం తేలడంతో గమనించి లబోదిబోమంది. చుట్టుపక్కల వారు వచ్చి నీటిలో నుంచి బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహం వెలికి తీతకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులకు పెద్దఎత్తున గోతులు తవ్వారని, గోతుల్లో నిలిచిన వర్షపు నీటిలో పడి పలువురు మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
రిజర్వాయర్ గుంతలో పడిపోయిన అక్కాతమ్ముడు
బాలిక మృతదేహం లభ్యం.. లభించని బాలుడి ఆచూకీ
Comments
Please login to add a commentAdd a comment