‘విద్యానిధి’కి స్వచ్ఛందంగా విరాళాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యానిధికి పలువురు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పలువురు దాతలు కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేందిరను కలిసి విద్యానిధి కోసం చెక్కులు అందజేశారు. మున్సిపల్ కాంట్రాక్టర్లు, మెప్మాకు చెందిన ఆర్పీలు 8 మంది కలిసి రూ.3.37 లక్షల చెక్కులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి విద్యానిధికి దాతల ద్వారా నిధులు సేకరిస్తున్నామన్నారు. ఈ మేరకు గత నెలలో సుమారు రూ.8.50 లక్షలు దాతలు అందజేశారన్నారు. విద్యకు సంబంధించి, పాఠశాలల్లో వసతులు, పేద విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు విద్యానిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ సంవత్సరం విద్యానిధి ద్వారా రూ.2 కోట్లు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నెలలో సుమారు రూ.40 లక్షలు విద్యానిధికి దాతల ద్వారా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యానిధిలో ఉద్యోగులు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment