కొత్త పింఛన్లు ఎప్పుడో..?
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్ రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా ఆసరా (చేయూత) కింద రూ.4 వేలు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్ మొత్తానిన రూ.2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఎన్నికల హామీని అమలు చేయకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అర్హులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. ఆసరా పింఛన్ అర్హత వయసు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించి, 2021 ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించారు. పింఛన్లు మంజూరు చేయాలని వృద్ధులు, దివ్యాంగులు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలోనూ ఫిర్యాదులు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామసభల్లోనూ పలువురు దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాలో 1,00,759 మంది..
జిల్లాలో 1,00,759 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు 35,380, వితంతువులు 42,714, దివ్యాంగులు 13,238, ఒంటరి మహిళలు 4,288, హెచ్‌ఐవీ బాధితులు 2,200, ఫైలేరియా బాధితులు 49, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు 111, గీత కార్మికులు 621, చేనేత కార్మికులు 442, బీడీ కార్మికులు 1,716 మంది చొప్పున ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.24,73,50,960 పింఛన్ల రూపంలో అందజేస్తుంది. జిల్లాలో వేలల్లో కొత్తగా ఆసరా పింఛన్లకు అర్హులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా ఆసరా పింఛన్ పథకంలో భాగంగా ప్రతినెలా దివ్యాంగులకు రూ.4,016 ఇస్తుండగా.. వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు రూ.2,016 చొప్పున అందిస్తున్నారు.
సమాచారం లేదు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నాం. పింఛన్ పెంపుపై ఇంకా మాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం పాత పద్ధతిలోనే పింఛన్లు ఇస్తున్నాం. కొత్తగా మంజూరైనప్పుడు ముందుగా ప్రభుత్వమే ప్రకటిస్తుంది.
– నర్సింహులు, డీఆర్‌డీఓ
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూలబ్ధిదారుల ప్రదక్షిణలు
ప్రజాపాలన సభల్లోనూ
దరఖాస్తుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment