ముందడుగు పడేనా?!
రిజర్వు ఫారెస్టులోని రోడ్లు బీటీగా మార్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా
● భూత్పూర్– చించోలి జాతీయ రహదారి–167ఎన్ మహబూబ్‌నగర్ సమీపంలోని రిజర్వు ఫారెస్టు మీదుగా వెళ్తుంది. అయితే అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో రిజర్వ్ ఫారెస్టు మీదుగా వెళ్లే దాదాపు 2.5 కి.మీ., మేర జాతీయ రహదారి పనులు నిలిచిపోయాయి. ఈ రోడ్డు నిర్మాణంలో పోతున్న భూమికి బదులుగా మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నం.23లో ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులు జరిగే అవకాశం ఉంది.
● నవాబ్‌పేట ఆర్‌అండ్‌బీ నుంచి గుడిమల్కాపూర్ వరకు 3.8 కి.మీ., మట్టి రోడ్డు రిజర్వ్ ఫారెస్టు మీదుగా వెళ్తుంది. ఈ రోడ్డును గతంలో పలుమార్లు బీటీగా మార్చేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చినా నిర్మాణ పనులకు ముందడుగు పడలేదు. ప్రస్తుతం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ 610, 2024 అక్టోబర్ 10న రూ.4.50 కోట్లతో గుడిమల్కాపూర్ రోడ్డు బీటీగా మార్చేందుకు మళ్లీ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. గుడిమల్కాపూర్ బీటీ రోడ్డు నిర్మాణంలో రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించి 12 ఎకరాల భూమి పోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమికి బదులుగా మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నం.23లో ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపారు.
హన్వాడ మండలం పల్లెమోనికాలనీ గ్రామ శివారులోని కొత్తచెర్వుతండాకు వెళ్లే రోడ్డు ఇది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రోడ్డును బీటీగా మార్చేందుకు గతంలో పలుమార్లు అనుమతులు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. జాతీయ రహదారి–167ఎన్ మెయిన్ రోడ్డు నుంచి రిజర్వు ఫారెస్టు మీదుగా కొత్తచెర్వుతండా వరకు 2.5 కి.మీ., ఉంటుంది. 2024 అక్టోబర్ 10న బీటీగా మార్చేందుకు రూ.3.35 కోట్లతో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినా ఇప్పటి వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. అటవీ శాఖ అనుమతిస్తే తప్ప ఈ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తికాదు.
Comments
Please login to add a commentAdd a comment