బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తతో మహిళ మృతి

Published Tue, Jan 21 2025 12:47 AM | Last Updated on Tue, Jan 21 2025 12:47 AM

బస్సు

బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తతో మహిళ మృతి

నారాయణపేట రూరల్‌: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నారాయణపేట మండలం సింగారం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి చెందిన కారంపొడి మణెమ్మ (36) తన సోదరి కుమారుడిని సింగారం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న (దామరగిద్ద) ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో వదిలిపెట్టేందుకు వచ్చింది. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు సింగారం సర్కిల్‌లో నారాయణపేట ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఎక్కడానికి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్‌ గమనించకుండా బస్సును ముందుకు కదిలించడంతో ముందు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ భానుప్రకాష్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా మార్చురికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలంటూ బాదిత కుటుంబ సభ్యులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. వారికి గ్రామస్తులతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ డీఎం లావణ్య, విజిలెన్స్‌ ఎస్‌ఐ సమక్షంలో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి..

ధన్వాడ: రామాలయం శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని మందిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. మందిపల్లిలో రామాలయం నిర్మించి ఏడాది కావడంతో వార్షికోత్సవం కోసం ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. వెంకటయ్య(40)తో పాటు మరో ముగ్గురు దేవాలయం పైకి ఎక్కి గోపురాన్ని శుభ్రం చేశారు. అనంతరం కిందకు దిగే క్రమంలో వెంకటయ్య ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమైంది. హుటాహుటిన నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశిలించిన డాక్టర్లు మార్గమధ్యలోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. దేవాల యం నిర్మించినప్పటి నుంచి వెంకటయ్య నిర్వహణ బాధ్యతలు చూసుకునేవాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

ఎర్రవల్లి: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని బీచుపల్లి హైవే బస్టాప్‌ దగ్గర ఆదివారం రాత్రి కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ వాహనం గుర్తుతెలి యని వ్యక్తిని ఢీకొట్టింది. ఈప్రమాదంలో అ తడికి తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు గమనించిన పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 40–45ఏళ్లు ఉంటాయని, కుడిచేతికి ఆకుపచ్చ దారం, ఎరుపు అంగీ, బ్లూ కలర్‌ పంచ ధరించినట్లు ఎస్‌ఐయ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

విద్యుదాఘాతంతోపంచాయతీ కార్మికుడు మృతి

మాగనూర్‌: మండలంలోని నేరడగం గ్రామంలో పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న సాయిలు(40) ఇంట్లో సెల్‌ఫోన్‌ చార్జీంగ్‌ పెడుతూ పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్‌ను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నేరడగం గ్రామపంచాయతీలో సాయిలు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం పనులు ముగించుకొని ఇంటికివెళ్లి సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతున్న క్రమంలో పక్కనే ఉన్న ఫ్యాన్‌ వైర్‌ను మరో చేతితో పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు మాగనూర్‌ ఇన్‌చార్జీ ఎంపీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి మృతుని అంత్యక్రియల నిమిత్తం రూ.10వేలు అందజేశారు.

ముగ్గురికి రిమాండ్‌

చిన్నచింతకుంట: మండలంలోని మద్దూర్‌ గ్రామంలో జరిగిన దాయాదుల ఘర్షణలో ముగ్గురిని రిమాండ్‌ చేసినట్లు ఎస్‌ఐ ఆర్‌.శేఖర్‌ తెలిపారు. నెలరోజుల క్రితం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వెంకటన్న, భాగ్యమ్మపై వారి దాయాదులు సద్దలి అంజన్న, సద్దలి సంజీవ, అనిల్‌ దాడిచేసి గాయపర్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నిందితులను సోమవారం మహబూబ్‌నగర్‌ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తతో  మహిళ మృతి 
1
1/1

బస్సు డ్రైవర్‌ అజాగ్రత్తతో మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement