ధాన్యం దిగదు.. లారీ కదలదు | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగదు.. లారీ కదలదు

Published Sun, May 5 2024 3:10 AM

ధాన్యం దిగదు.. లారీ కదలదు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం అన్‌లోడింగ్‌ కోసం రైస్‌మిల్లుల వద్ద లారీలు వారం రోజులపాటు నిరీక్షించాల్సి వస్తోంది. తాలు, తప్ప, ధాన్యం గింజ విరిగి నూకలు వస్తున్నాయంటూ మిల్లర్లు ధాన్యం దించుకోవడానికి కొర్రీలు పెట్టడంతో జాప్యం జరుగుతోంది. బస్తాకు రెండు నుంచి మూడు కిలోల కోతకు కేంద్రాల నిర్వాహకులు ఒప్పుకుంటేనే దించుకునేందుకు ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని మిల్లుల్లో గత వానాకాలం సీజన్‌ ధాన్యం నిల్వ ఉంది. ఇప్పుడు ధాన్యం తీసుకునేందుకు కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. లోడ్‌ అయిన లారీలు తిరిగి రాకపోవడం, తూకం వేయకపోవడంతో రైతులు పడిగాపులు గాస్తున్నారు. తరుగు కోసమే తిరకాసు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పదిహేను రోజులుగా ధాన్యం ఆరబెడుతున్నా తూకం వేసేందుకు తాత్సారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రాల్లో భారీగా ధాన్యం

గత పది రోజులుగా వరి కోతలు వేగవంతం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. ఆరబోసుకునే వీలు లేకుండా కుప్పలుగా పేరుకుపోతోంది. తూకం వేసిన బస్తాలు రైస్‌మిల్లుకు రవాణా కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 15వేల నుంచి 20వేల బస్తాలతో రాశులుగా కనిపిస్తున్నాయి. స్థలం లేకపోవడంతో కాంటా వేయడం నిలిపి వేశారు. లక్సెట్టిపేట, హాజీపూర్‌, జైపూర్‌, భీమారం, చెన్నూర్‌, భీమిని, కన్నెపెల్లి తదితర మండలాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి ధాన్యం కొనుగోలులో జాప్యం, రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

అన్‌లోడింగ్‌కు మిల్లర్ల కొర్రీలు

నూకలు వస్తున్నాయంటూ తిరకాసు

రోజుల తరబడి నిరీక్షణ

కొనుగోలు ధాన్యం లక్ష్యం 1.76 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు కొనుగోలు 37,813.280 మెట్రిక్‌ టన్నులు

మొత్తం రైతులు 5,190 మంది

ధాన్యం నగదు మొత్తం రూ.83,30,26,558

రైతులకు అందింది రూ.12,20,53,557

మిల్లులకు తరలిన ధాన్యం 31,948.400 మెట్రిక్‌ టన్నులు

తూకం వేసి కేంద్రంలో ఉన్న ధాన్యం 5,864.880 మెట్రిక్‌ టన్నులు

Advertisement
 
Advertisement