ఇక సూపర్ స్పెషాలిటీ సేవలు
● జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి ● జీప్లస్ 6అంతస్తుల్లో 600పడకలతో నిర్మాణం ● నేడు భూమి పూజ చేయనున్న మంత్రులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏళ్లుగా అరకొర వైద్య సేవలతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి రాబోయే రోజుల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాతోపాటు ఆసిఫాబాద్, మహారాష్ట్ర వాసులకు ఈ ఆస్పత్రి ఏర్పాటుతో ఎంతో ప్రయోజనం కలుగనుంది. జిల్లా నుంచి నిత్యం అనేక మంది వైద్య సేవల కోసం సాధారణ, అత్యవసర వేళల్లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలాసార్లు ఇక్కడి ఆస్పత్రుల నుంచి సౌకర్యాలు లేక నగరాలకు రెపర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఆవిర్భావం జరిగినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇంకా ఎంతగానో వైద్య సేవలు మెరుగుపడాల్సి ఉంది. ఆపదలో మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షల ఫీజుల చెల్లించలేక ఆర్థికంగా చతికిల పడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులకే తమ కష్టార్జీతాన్ని దారపోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జబ్బులకు సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లు జిల్లా పరిధిలోనే అందుబాటులోకి రానున్నారు. ఈ సమస్యలన్నీ తీర్చేందుకు జిల్లా కేంద్రంలో ఐబీ పరిధిలోని ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలంలో ఈ మేరకు గురువారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం, మాతాశిశు సంరక్షణ కేంద్ర భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చొరవతో భవన నిర్మాణం కోసం ఇప్పటికే తొలి విడతలో రూ.50కోట్లు మంజూరయ్యాయి. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎమ్మెల్యే పట్టుదలగా ఉండడంతో మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment