ప్రశాంతంగా ‘మహా’ పోలింగ్
● వివాదాస్పద గ్రామాల్లో 62శాతం ఓటింగ్ నమోదు ● పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
కెరమెరి(ఆసిఫాబాద్): మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బుధవారం సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని 15 వివాదాస్పద గ్రామాల ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి తీవ్రత కారణంగా ఉదయం 10 గంటల వరకు మందకొడిగా సాగింది. పరంధోళి పోలింగ్ కేంద్రంలో 1273 ఓటర్లు ఉండగా 770 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే భోలాపటార్‌లో 914 మందికి 580 మంది, పుడ్యాన్ మొహదా 470 మందికి 282 మంది, మహరాజ్‌గూడలో 328 మందికి 230 మంది ఓటు వేశారు. ఆయా గ్రామాల్లో 1852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. 62 పోలింగ్ శాతం నమోదైంది.
ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు ఆసక్తి చూపారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పరంధోళి, భోలాపటార్, మహారాష్ట్రలోని పుడ్యాన్ మొహదా పోలింగ్‌కేంద్రాలకు గ్రామాలు దూరంగా ఉండటంతో ఓటర్లు కాలినడకన తరలివచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ భారీ భద్రత కల్పించారు. మీడియాకు కూడా అనుమతివ్వకపోడంతో కొందరు మహారాష్ట్ర పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పరంధోళిలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
నడిచివచ్చి ఓటేశా..
పోలింగ్ కేంద్రానికి మా కోటా గ్రామం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి నడిచివచ్చి ఓటు వేశా. ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. – జాదవ్ శేశారావు, కోటా
Comments
Please login to add a commentAdd a comment