ఇంటర్‌ విద్య బలోపేతంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్య బలోపేతంపై దృష్టి

Published Tue, Dec 24 2024 12:18 AM | Last Updated on Tue, Dec 24 2024 12:19 AM

ఇంటర్‌ విద్య బలోపేతంపై దృష్టి

ఇంటర్‌ విద్య బలోపేతంపై దృష్టి

● కళాశాలల్లో శతశాతం ఉత్తీర్ణతకు కసరత్తు ● ఉమ్మడి జిల్లాకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ నియామకం

మంచిర్యాలఅర్బన్‌: పదో తర్వాత అత్యంత కీలకమైన ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణత అంతంతగానే మారుతోంది. విద్యార్థుల హాజరు శాతం సగం కూడా దాటని పరిస్థితి ఏర్పడుతోంది. దీని ప్రభావం ఉత్తీర్ణతపై చూపి ఫలితాల శాతం తగ్గుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం ఇంటర్‌ విద్య బలోపేతంపై దృష్టి సారించింది. విద్యార్థుల ఉత్తీర్ణత పెంపునకు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్మీయెట్‌ ఎడ్యుకేషన్‌ ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో ఫీల్డ్‌ ఆఫీసర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు ఈఆర్‌టీడబ్ల్యూ(ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ వింగ్‌) వి.రమణారావును నియమించింది. ఇక కళాశాలల వారీగా క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్థిష్ట పరిశీలన, సూచనలతో కూడిన నివేదిక అందించనున్నారు.

క్షేత్రష్థాయిలో పరిశీలన ఇలా..

ఉమ్మడి జిల్లాకు నియమించిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ కళాశాలలను సందర్శిస్తారు. అకాడమిక్‌ ఆర్గనైజర్‌, యూనిట్‌ టెస్ట్‌లు, త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షలు, అడ్మిషన్లు, హాజరు, సిలబస్‌ మెరుగుదల పరిశీలిస్తారు. జిల్లాలో చాలా కళాశాలల్లో పరీక్ష రుసుం చెల్లించని విద్యార్థులు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ పరిశీలనకు వెళ్లి కళాశాల పేరు, ప్రిన్సిపాల్‌, జూనియర్‌ లెక్చరర్‌ పేరు, మొబైల్‌ నెంబర్‌, 2025లో ప్రవేశాలు, టీపీఎల్‌ మార్చి 2024 ఫలితాలు ఆరా తీస్తారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే కారణాలేమిటో తెలుసుకుంటారు. ఫీజు చెల్లించేలా ప్రోత్సహించే చర్యలేమిటో తేల్చనున్నారు. విద్యార్థుల గైర్హాజరుకు కారణాలపై వివరాలు సేకరిస్తారు. సబ్జెక్టుల వారీగా జూనియర్‌ లెక్చరర్లు విద్యార్థుల సామర్థ్యాల కోసం రూపొందించుకున్న పాఠ్యంశాలు, అర్ధ వార్షిక పరీక్షల్లో పనితీరు, డ్రాపౌట్‌ కోసం ఏం చర్యలు చేపట్టారో..? అధికారి సందర్శన అనంతరం నివేదిక రూపొందిస్తారు.

పాఠ్యాంశాల వారీగా..

వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. పాఠ్యాంశాల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ నెలలో పరీక్షలు నిర్వహించి విద్యార్థి స్థాయిని అంచనా వేయనున్నారు. వెనుకబడిన వారిని ముందున్న వారితో సమానం అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నారు. ఇలా పరీక్షల సమయం వరకు అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రతీ అధ్యాపకుడు దృష్టి సారిస్తారు. విద్యార్థులు రోజు కళాశాలకు వచ్చేలా అన్ని పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణత సాధించేలా చేయడం అధ్యాపకుడి బాధ్యత. డిసెంబర్‌ నెలాఖరుకు సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఈ తరుణంలోనే కొత్తగా నియమించిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ క్షేత్రస్థాయి సందర్శించడం, ఉన్నతాధికారులకు నిర్దేశిత నివేదిక అందించి శతశాతం ఫలితాలకు కసరత్తు చేస్తారు.

జిల్లాల వారీగా కళాశాలలు, విద్యార్థుల వివరాలు

జిల్లా కళాశాల సంఖ్య ఫస్టియర్‌ సెంకడియర్‌

ఆదిలాబాద్‌ 13 3363 3193

నిర్మల్‌ 12 2509 2206

మంచిర్యాల 10 2012 1981

కుమురంభీం ఆసిఫాబాద్‌ 11 2127 2039

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement