బాల్యం బలహీనం!
మంచిర్యాలఅర్బన్: భవిత బంగారుమయం కావాలంటే.. బాల్యం పటిష్టంగా కావాలి. ఎదిగే పిల్లలు సమయానికి సరిగా తినకపోవటం సహా సమతుల ఆహరం తీసుకోకపోవటంతో ఎనీమియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ తరుణంలో విద్యార్థుల్లో అత్యంత కీలకమైన రక్తహీనత సమస్యను గుర్తించేందుకు ఎనీమియా ముక్తభారత్ పథకంలో భాగంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఎనీమియా ముక్త్ తెలంగాణ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు హిమాగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాయి. బాలికలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది.
మూడు నెలలుగా..
అక్టోబర్ 24నుంచి డిసెంబర్ 24 వరకు ఆర్బీఎస్‌కే(రాష్ట్రీ బాల స్వస్థత కార్యక్రమం) సిబ్బంది ఆధ్వర్యంలో డీహెచ్‌ఎంవో హరీశ్‌రాజ్ పర్యవేక్షణలో ఆర్‌బీఎస్‌కే పీవో అనిత ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బృందాలు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే బాలబాలికలకు రక్త పరీక్షలు నిర్వహించారు. బృందాలకు పరీక్షలు చేసే ప్రత్యేక స్ట్రిప్‌లను అందించారు. హిమో మీటరు ద్వారా రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం ఎంత అనేది అక్కడే తేల్చారు.
రక్త పరీక్షలు ఇలా..
జిల్లాలోని 809 పాఠశాలల్లో 5, 6, 7వ తరగతులకు చెందిన 7,124 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేశారు. ఇందులో 3,936 బాలికలు, 3,188 మంది బాలురకు రక్తపరీక్షలు చేశారు. సాధారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. 8 గ్రాములకన్నా తక్కువ ఉంటే తీవ్ర సమస్యగా పరిగణిస్తారు. ఆరు గ్రాముల కంటే తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. 12 గ్రాముల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు 3,034 మంది ఉన్నారు. స్వల్పం 11 నుంచి 11.9 హిమోగ్లోబిన్ ఉన్నా విద్యార్థులు 1,370 మంది(బాలికలు 799, బాలురు –571) మందిని గుర్తించారు. 8 నుంచి 10.9 హిమోగ్లోబిన్ ఉన్న విద్యార్థులు 2,396 మంది (బాలురు 1,075, బాలికలు 1,321 )గా తేల్చారు. 8 గ్రాముల కంటే తక్కువగా తీవ్ర రక్తహీనతో బాధపడుతున్న విద్యార్థులు 308 మందిని గుర్తించారు. ఇందులో 195 బాలికలు, 113 బాలురు ఉన్నారు. వీరిని జిల్లా ఆసుపత్రి విభాగానికి సిఫారసు చేశారు.
5 నుంచి 7వ తరగతుల విద్యార్థులకు రక్త పరీక్షలు
ఎనీమియాతో బాధపడుతున్న చిన్నారులు
జనవరి నుంచి మార్చి వరకు ..
ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరి నుంచి మార్చి వరకు 8, 9, 10వ తరగతి వి ద్యార్థులకు రక్తపరీక్షలు చేశారు. మొత్తం 20,168 మంది విద్యార్థుల్లో 10,939 బాలికలు, 9,679 మంది బాలురకు రక్త పరీక్షలు నిర్వహించారు. హెచ్‌బీ శాతం సాధారణంగా(12 శాతంపైన) ఉన్న విద్యార్థులు 7,959 (బాలురు 4,660–బాలికలు 3,299). స్వల్పంగా ఉన్న విద్యార్థులు 3,557(బాలురు 1,687, బా లికలు 1,870) మంది, మధ్యస్థం 7,167 (బాలురు 2,373, బాలికలు 4,794) తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులు 1,850 మంది ఉన్నారు. ఇందులో 1,196 మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేల్చారు. 297 మంది విద్యార్థులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సిఫారసు చేశారు. 12 మందికి రక్తం ఎక్కించారు. త్వరలో 1 నుంచి 4వ తరగతి చదివే ప్లిలలకు ఈ పరీక్షలు చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. విద్యార్థుల్లో ప్రాథమిక దశలో రక్తహీనత సమస్యలను గుర్తిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని వైద్యాధికారులు తెలిపారు. దశలవారీగా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు హిమాగ్లోబిన్ పరీక్షలు చేపట్టి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment