నత్తనడకన పన్నుల వసూళ్లు
● పంచాయతీ పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ● రూ.8.36 కోట్లకు రూ.1.16 కోట్లు వసూలు ● ఇప్పటివరకు 17శాతమే..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు నత్తకే నడక నేర్పేలా సాగుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పన్నుల వసూలు 100శాతం చేరడానికి మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో రూ.8.36 కోట్ల డిమాండ్ కాగా ఇప్పటివరకు రూ.1.16 కోట్లు మాత్రమే వసూలు కాగా.. 17శాతం మాత్రమే ఉంది. వసూళ్ల వేగవంతానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సమీక్షలు, లక్ష్యాలను నిర్దేశించడం, కార్యదర్శులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం వంటివి చేయనున్నారు. మరో వారం రోజుల్లో కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పన్నుల వసూళ్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.
అదనపు పనిభారం
పంచాయతీ కార్యదర్శులు పనిభారంతో పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవడం లేదని తెలుస్తోంది. పారిశుద్ధ్య పనుల నిర్వహణతోపాటు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కాంపోస్ట్ షెడ్‌లు, నర్సరీల నిర్వహణ, డీఎస్‌ఆర్, యాప్ అప్‌లోడ్‌లలో నిరంతరం బిజీగా ఉండడం, పింఛన్లు, వివిధ రకాల సర్వేలతో సతమతం అవుతున్నారు. ప్రధానంగా ఎల్‌ఆర్‌ఎస్ సర్వే ఉండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో బిజీ అయ్యారు. దీంతో పన్నుల వసూళ్లు అటకెక్కాయి. గతంలో పన్నుల వసూళ్లలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడుస్తున్నా 17శాతం వసూళ్లు చేసి రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది.
ఇంటి పన్నులే కీలకం..
ప్రధానంగా ఇంటి పన్నులే పంచాయతీల రాబడిలో కీలకం కాగా ఇళ్ల అనుమతులు, జరిమానాలు, తైబజార్ తదితర వాటి ద్వారా వచ్చే ఆదాయం, వ్యాపార సముదాయాలకు విధించే జరిమానాలు, పన్నులు తదితర వాటి ద్వారా సమకూరే నిధులను నాన్ టాక్సుల కింద లెక్కిస్తారు. ఇంటి పన్నుల వసూళ్లలో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నా నాన్ టాక్సుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పన్నుల వసూళ్లకు చివరి మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. పన్నులు వంద శాతం చేరేలా ముందుకు సాగాలని అధికారులు సూచిస్తున్నారు.
వేగవంతం చేస్తాం..
జిల్లాలో పన్నుల వసూళ్ల పర్వం వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నాం. త్వరలో సమావేశం ఏర్పా టు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టేలా కార్యదర్శులకు సూచనలు చేస్తాం. గ్రామాల్లో డప్పు చాటింపుతోపాటు అవసరమైతే ఇంటింటికి, వ్యాపారుల వద్దకు వెళ్లి పన్నుల వసూలుతోపాటు పెద్ద ఎత్తులో బకాయిలు ఉన్న వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తాం.
– వెంకటేశ్వర్‌రావు, డీపీఓ, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment