హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
● పాత కక్షలతో వ్యక్తి హత్యకు కుట్ర ● రూ.50వేల సుపారీ ఇచ్చి పథకం ● చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
బెల్లంపల్లిరూరల్: కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం పాతసర్సాలకు చెందిన పాముల పురుషోత్తంపై ఈనెల 24న హత్యాయత్నానికి పాల్పడి కారును ఆపహరించుకుని పోయిన నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ఆఫ్జలొద్దిన్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. పాతసార్సాల గ్రామానికి చెందిన పాముల శివసాయి, జాడి శ్యామ్‌రావులకు గతంలో పురుషోత్తంతో విభేదాలు ఉన్నాయి. పాతకక్షలు మనస్సులో పెట్టుకుని ఆయ న హత్యకు కుట్ర పన్నారు. కాగజ్‌నగర్, మహారాష్ట్ర రాష్ట్రం బల్లార్షాకు చెందిన పెంటపర్తి రమేశ్ అలి యాస్ చింటు, సముద్రాల మహేశ్ అలియాస్ సురేష్, ఋషికేష్ ప్రదీప్ కుమార్‌లకు రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్యకు పథకం రచించారు. ఈనెల 24న రమేశ్, సురేష్, ప్రదీప్‌కుమార్‌లు..కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లేందుకు పురుషోత్తంకు చెందిన కారును కిరాయి మాట్లాడుకున్నారు. మార్గమధ్యలో బెల్లంపల్లికి చేరుకోగానే శ్రీనిధి హోమ్స్ సమీపంలో ఒకరిని దించాలని కోరడంతో పురుషోత్తం వాహనాన్ని యూటర్న్ తీసుకుని తిరుమల హిల్స్ వైపు తిప్పాడు. ఇదే అదునుగా మూత్రవిసర్జన కోసం వాహనాన్ని ఆపిన నిందితులు పురుషోత్తంను తీవ్రంగా గాయపర్చారు. చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత కారును, రూ.3500 నగదు, సెల్‌ఫోన్‌ను అపహరించుకుని కాగజ్‌నగర్ వైపు వెళ్లారు. దీంతో పురుషోత్తం కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శుక్రవారం తాండూర్ మండలం మాదారం 3 ఇంక్‌లైన్ సమీపంలోని అడవిలో ఉన్న నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కారు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.5 వేల నగదు జప్తు చేశారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఆఫ్జలొద్దిన్, ఎస్సైలు రమేశ్, మహేందర్, ప్రసాద్‌లను మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అభినందించారు. తాళ్లగురిజాల, బెల్లంపల్లి టూటౌన్, నెన్నెల ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment