వేధింపులతో యువకుడి ఆత్మహత్య
● ఆస్పత్రి, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులపై కేసు
నిర్మల్: తనకంటూ ఉపాధి పొందడంతోపాటు జీవితంలో స్థిరపడొచ్చన్న ఆశతో ఓ యువకుడు ఓ ఆస్పత్రిలో పెట్టిన భాగస్వామ్యం తన నిండుప్రాణాన్ని తీసుకుంది. జిల్లాకేంద్రంలోని నాయుడివాడకు చెందిన కొర్తికంటి వంశీకృష్ణ(25) ఈనెల 24న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో మృతిచెందాడు. వంశీకృష్ణ రాసిన సూసైడ్ లెటర్‌తోపాటు పట్టణ సీఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వంశీకృష్ణ స్థానిక ప్రియా నర్సింగ్‌హోమ్‌లో పార్ట్‌నర్‌గా ఉన్నాడు. ఈక్రమంలో రెండు మెడికల్ ఏజెన్సీల నుంచి ఆస్పత్రి కోసం మందులు తీసుకున్నాడు. ఇటీవల ఆస్పత్రిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న నాందేడపు శ్రీధర్‌తో గొడవ కావడంతో వంశీకృష్ణ దూరంగా ఉంటున్నాడు. మెడికల్ కోసం తీసుకువచ్చిన ఏజెన్సీల బిల్లులను నిర్వాహకులు ఆస్పత్రి నుంచి చెల్లించలేదు. ఇదే సందర్భంలో మందులు ఇచ్చిన మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు మారుగొండ రోహిత్, పూదరి శివకుమార్, గున్నాల రంజిత్‌లు తమ డబ్బుల కోసం ఆస్పత్రి నిర్వాహకులను కాకుండా తమ వద్ద నుంచి నువ్వే తీసుకున్నావంటూ వంశీకృష్ణను పలుమార్లు వేధించారు. అటు ఆస్పత్రి, ఇటు మెడికల్ ఏజెన్సీల నుంచి వస్తున్న వేధింపులను తట్టుకోలేక వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు తల్లి జయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాందేడపు శ్రీధర్, మారుగొండ రోహిత్, పూదరి శివకుమార్, గున్నాల రంజిత్‌లపై కేసులు నమోదు చేసినట్లు పట్టణసీఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెందినవారు ఉండటం జిల్లాకేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.
జీవితంపై విరక్తితో యువకుడు..
ఇంద్రవెల్లి: మానసికస్థితి సరిగా లేని యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై భీంరావ్ కథనం ప్రకారం.. మండలంలోని ఏమాయికుంట పంచాయతీ పరిధి న్యూహీరపూర్(రమాయినగర్)కు చెందిన మెస్రం నాగేష్(20) గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేదు. కుటుంబీకులు నాటువైద్యం చేయించిన నయం కాకపోవడంతో నాగేశ్ తీవ్ర మనస్తాపం చెందాడు. జీవితంపై విరక్తితో గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఇంటికొచ్చిన తల్లిదండ్రులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి మెస్రం శేకు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment