వరి కొయ్యలను కాలిస్తే ముప్పే!
వరి కొయ్యలు, ఆయా పంటల అవశేషాలను దహనం చేయరాదు. ఒకవేళ చేస్తే తీవ్ర నష్టం జరగొచ్చు. భూమిలోని పోషకాలు తగ్గి దిగుబడి పడిపోవచ్చు. పంటకు మేలు చేసే పోషకాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం ఆవిరై భవిష్యత్‌లో పంటల ఉత్పాదకపై ప్రతికూల ప్రభావం పడనుంది. అంతేకాదు వాయుకాలుష్యం వల్ల రైతు ఆరోగ్యానికి చేటు కూడా. అందువల్ల వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలో 5 లక్షల పైచిలుకు ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 3.50 లక్షలపైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి 3 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. పంట కొయ్యలతోపాటు వాటి అవశేషాలను రైతులు కాల్చి వేస్తున్నారు. దీంతో భూసారంతో పాటు వాయుకాలుష్యంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. వాటిని తగలబెట్టవద్దని రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతోంది. ఒక వేళ తగలబెడితే చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి చర్యల వల్ల ఈ ప్రాంతాల్లో వాయుకాలుష్యంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బడులకు సెలవులు ఇస్తున్నారు. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో రావద్దంటే వరి, ఇతర పంటల అవశేషాలు కాల్చ వద్దని హెచ్చరిస్తున్నారు.
భూమిలోని పోషకాలపై తీవ్రప్రభావం
పంట దిగుబడి తగ్గే చాన్స్
వాయుకాలుష్యంతో రైతులకు చేటు
అవగాహన కల్పనకు
వ్యవసాయ శాఖ సన్నద్ధం
దుక్కిలో దున్నేస్తేనే మేలు
కొయ్యలు, ఇతర అవశేషాలు తగలబెట్టడంతో భూసారం దెబ్బతింటుంది. భవిష్యత్‌లో పంటల దిగుబడి గణనీయంగా తగ్గొచ్చు. వాయుకాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాటిని తగలబెట్టకుండా దుక్కిలో దున్నేస్తే సేంద్రియ ఎరువులు తయ్యారవుతాయి. కొయ్యలను తగలబెట్టితే రైతులపై చర్యలు తప్పవు.
– గోవింద్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, మెదక్
Comments
Please login to add a commentAdd a comment