![వడివడిగా అడుగులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09nrs21a-350105_mr-1739152418-0.jpg.webp?itok=Vtl1791x)
వడివడిగా అడుగులు
● ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు ● మాసాయిపేట మండలంలో 578 ఎకరాల కేటాయింపు ● భూ సేకరణపై విచారణ ప్రారంభం
వెల్దుర్తి(తూప్రాన్): ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం భూ సేకరణకు సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. జాతీయ రహదారి 44, మాసాయిపేట మండల కేంద్రానికి సమీపంలోని అచ్చంపేట, హకింపేట, రామంతాపూర్ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం కోసం టీజీఐఐసీ జోనల్ మేనేజర్ 979.11 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మాసాయిపేట మండలం అచ్చంపే ట శివారులోని సర్వే నంబర్లు 61 నుంచి 86 వరకు, మరియు 115, 122, 130, 131, 132లలో 416.20 ఎకరాలు, హకింపేట పరిధిలోని 12, 17, 19, 20, 95, 194, 93, 97, 112 సర్వే నంబర్లలో 162.14 ఎకరాలు కలిపి మొత్తం 578.34 ఎకరాల సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించారు.
భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం
మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. అచ్చంపేట పరిధిలో గుర్తించిన 416.20 ఎకరాల్లో అదే గ్రామానికి చెందిన సుమారు 200 మంది, చిన్నశంకరంపేట మండలం ధర్పల్లికి చెందిన సుమారు 42 మంది, హకింపేట పరిధిలో 162.14 ఎకరాల్లో హకింపేటతో పాటు అచ్చంపేటకు చెందిన 87 మంది రైతులు భూములు కోల్పోనున్నారు. ఆయా భూముల్లో బోర్లు, ఇతర నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా..? ఉంటే వాటి విలువ ఎంత మేరకు ఉంటుంది అని మరో రెండు మూడు రోజుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నారు. పూర్తి వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ప్రభుత్వం బాధిత రైతులందరికీ నష్ట పరిహారం చెల్లించిన అనంతరం పార్కు పనులు ప్రారంభం కానున్నా యి. కాగా అచ్చంపేట పరిధిలో 1990లో సీలింగ్ పట్టాలు పొందిన 242 మంది రైతుల్లో సుమారు 50 మందికి సంబంధించిన భూముల వివరాలు రికార్డులో నమోదు కాలేదని అధికారులు గుర్తించారు. అదేవిధంగా సుమారు 70 మంది రైతుల వివరాల్లో తేడాలు ఉన్నట్లు గమనించారు. అందులో భాగంగానే ఇటీవల అచ్చంపేట శివారులోని 70 మంది రైతుల రికార్డుల తొలగింపు, విస్తీర్ణం సవరణ వంటి వాటికి సంబంధించి నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న వారిలో ఏవైనా అభ్యంతరాలుంటే సరైన పత్రాలతో శనివారం సాయంత్రం లోపు మాసాయిపేట రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలని తహసీల్దార్ జ్ఞానజ్యోతి సూచించారు. ఇదిలా ఉండగా వ్యవసాయం పైనే ఆధారపడి సాగు చేసుకుంటున్న భూములకు ఇండస్ట్రియల్ పార్కు నుంచి మినహాయింపు ఇస్తే బాగుంటుందని పలువురు రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment