టీవీ సీరియల్స్‌కు ప్లేబ్యాక్ సింగర్‌గా పని చేసిన షాహిద్ మాల్యా 'యమ్లా పాగ్లా దీవానా' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ మూవీలో గుర్బానీ పాట ఆలపించాడు షాహిద్. తర్వాత 'మౌసమ్' సినిమాలోని పాటలు హిట్ కావడంతో అతడికి మంచి గుర్తింపు లభించింది. అప్పటినుంచి వరుసగా హిందీ, పంజాబీ చిత్రాల్లో పాటలు పాడుతూ వస్తున్న ఆయన తెలుగులో ఎఫ్‌సీయూకే(ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్)లోనూ ఓ సాంగ్ పాడాడు.
తాజాగా అతడు గత నెలలో జరిగిన సంఘటన గురించి ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'మార్చి 14 రాత్రి నాన్న(కృష్ణ కుమార్ మాల్య) ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అతడి రక్తంతో నా బట్టలు తడిసిపోయాయి. చాలా రక్తం పోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో 16 కుట్లు పడ్డాయి. వెన్నెముక కూడా దెబ్బతింది. ఆయన్ను అలా చూడగానే అక్కడున్న అందరూ భయభ్రాంతులకు లోనై గట్టిగట్టిగా అరిచారు. వెంటనే తనని ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించాం. కోమాలోకి వెళ్లిన ఆయన వారం రోజుల తర్వాతే స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన్ను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. నాన్న కోలుకుంటున్నాడు' అని తెలిపాడు.
'నాన్న కూడా మంచి గాయకుడు. మహ్మద్ రఫీ వంటి గాయకులతో పనిచేశారు. ఆయనను తన గురువుగా చెప్తూ ఉంటాడు. నాన్న నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. గతంలో తనకు యాక్సిడెంట్ అయింది. అప్పటినుంచి గాయకుడిగా కెరీర్ కొనసాగించలేకపోయాడు. నా విజయాన్ని చూడటానికి నాన్న నావెంటే ఉండాలని కోరుకున్నాను' అని చెప్పుకొచ్చాడు సింగర్.
Comments
Please login to add a commentAdd a comment