అనువాద చిత్రాల వివాదం ముదిరేలా కనబడుతోంది. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించే విషయమై, ఇతర సమస్యల గురించి చర్చలు జరపడానికి ఆ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందనే టాక్ వినిపించింది.
అయితే ‘వారిసు’ తమిళ సినిమా కాబట్టి షూటింగ్ ఆపలేదని ‘దిల్’ రాజు పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ‘వారిసు’ తమిళ సినిమాయే అనే ముద్ర పడిపోయింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
కాగా సంక్రాంతి సందర్భంగానే నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ సంక్రాంతి రిలీజ్‌కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్‌కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారని టాక్. ఒకవేళ తెలుగులో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా కోలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్‌లో అల్లు అరవింద్ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment