నేడు డయల్ యువర్ డీఎం
ములుగు రూరల్: ములుగు జిల్లా పరిధిలోని ఆర్టీసీ సమస్యలపై నేడు(బుధవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై ప్రజలు మధ్యాహ్నాం 12 నుంచి ఒంటి గంట వరకు సెల్ నంబర్ 9959226048కు ఫోన్ చేయాలని సూచించారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అమ్మవార్లను దర్శించుకున్న తహసీల్దార్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను తాడ్వాయి తహసీల్దార్ గిరిబాబు మంగళవారం దర్శించుకున్నారు. తాడ్వాయి తహసీల్దార్‌గా బాధ్యతలను స్వీకరించిన ఆయన వనదేవతలను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ సంప్రదాయంగా అధికారులు, పూజారులు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవార్ల శేషవస్త్రంతో పూజారులు సన్మానించి బెల్లం ప్రసాదం అందజేశారు. తహసీల్దార్ వెంట దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ, పూజారులు ఉన్నారు.
ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు
ములుగు రూరల్: ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని పీఆర్‌టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోరాటాల ద్వారానే ఉపాధ్యాయులు తమ హక్కులు సాధించుకోవాలని తెలిపారు. రాజకీయ నాయకులు తాత్కలికంగా ఇచ్చే ఆకర్షణీయమైన హామీలు నమ్మి మోసపోవద్దని వివరించారు. శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యలపై గళం వినిపించే నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు.
ప్రజాసమస్యలపై
పోరాటాలు ఉధృతం
వెంకటాపురం(ఎం): ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పసుల కోటయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల ప్రథమ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రజా సమస్యలను విస్మరిస్తుందన్నారు. మండలంలో భూసమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. కాస్తులో ఉన్న రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రత్నం రాజేందర్, సాంబశివ, గఫార్, ప్రవీణ్, అలువాల అయిలయ్య, బ్రహ్మచారి, రెడ్డి రామస్వామి, సంపత్, స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఉపాధి
కల్పించడమే ధ్యేయం
గోవిందరావుపేట: మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే ధ్యేయమని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ రాజు కుమార్ తెలిపారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో శిక్షణ, ప్రొడక్షన్స్ సెంటర్‌లో మండల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో ఉషా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం బీసీ వెల్ఫేర్ నుంచి 260మంది విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడానికి మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉషా ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మొదటి గ్రూప్‌లో 15మందికి శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కాలం ముగిసిన తర్వాత కొత్త గ్రూప్‌కు శిక్షణ ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కంపెనీ పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీపీఎం గోవింద్ చౌహన్, ఏపీఎం నాగేశ్వరరావు, ఉషా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ శిక్షణ అధికారి శ్రీదేవి, మండల సమాఖ్య అధ్యక్షులు ప్రశాంత కుమారి, శిక్షణ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment