ఇంటింటి సర్వేపై అవగాహన ఉండాలి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, సమగ్ర, ఇంటింటి కుటుంబ సర్వేపై ఎన్యుమరేటర్లు పూర్తిస్థాయి శిక్షణ తీసుకోవడంతో పాటు ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్యుమరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 6వ తేదీ నుంచి ప్రభుత్వం సర్వే నిర్వహించనుందని తెలిపారు. సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు చివరి కుటుంబం వరకు అందేందుకు దోహదపడుతుందన్నారు. 150కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్, ప్రతీ 10మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ఇంటి నంబర్ ఆధారంగా గ్రామానికి వెళ్లి ఆధార్‌కార్డు ప్రకారం ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా సర్వే జరుగుతుందని వివరించారు. జిల్లాకోడ్, మండలం కోడ్‌లను ఎన్యుమరేటర్స్ ఖచ్ఛితంగా నమోదుచేయాలని వివరించారు. నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నావళి అధారంగా ఇంటి నంబర్, యజమాని, సభ్యులు వంటి వాటిని 100శాతం నమోదు చేయాలన్నారు. సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేసి ఎన్యుమరేటర్ల సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సమగ్ర ఇంటింటి సర్వేపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ దివాకర అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి హాజరయ్యారు.
పశువుల వివరాలు నమోదు చేయాలి
ములుగు రూరల్: జిల్లాలో పశుగణన చేపట్టి వాటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి కొమురయ్యలతో కలిసి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 29ఫిబ్రవరి 2025 వరకు 21వ జాతీయ పశు గణన కార్యక్రమం చేపట్టినట్లుగా వివరించారు. అందులో భాగంగా జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 99,459 కుటుంబాలను సర్వే చేసి ఆవులు, గేదెలు, కోళ్లు, గొర్రెలు, మేకలు ఇలా 16రకాల పశువులు, జీవాల సంఖ్యను యాప్‌లో నమోదు చేయనున్నట్లు వివరించారు. పశుగణన ఆధారంగా శాఖకు నిధులతో పాటు వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ వ్యాధి మందులు సరఫరా అవుతాయని వెల్లడించారు. జిల్లాలో 28మంది పశుగణన కర్తలు, 9మంది పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నరసింహ, డాక్టర్ నవత, పశువైద్యాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment