వినతుల పరిష్కారమే లక్ష్యం
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన వినతుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 24వినతులు రాగా పీఓ వినతులు స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ వినతుల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీడీ పోచం, ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, బాలాజీ, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.
పలు సమస్యలపై వచ్చిన వినతులు ఇలా..
గోవిందరావుపేట మండలం బాలాజీనగర్‌లో సోలార్ బోర్ పంపు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం భూపతిపూర్(సింగారం) గ్రామానికి చెందిన పున్నం రమేష్ ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం సండ్రగూడెం గ్రామానికి చెందిన లావుడ్య గణేశ్ పొలానికి సాగు నీటి కోసం సోలార్ పంపు సెట్ ఇవ్వాలని విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహదేవపురం గ్రామానికి చెందిన సమ్మక్క, మంజూల, ఈశ్వరమ్మ కలిసి ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా లడ్డూ తయారీ యూనిట్‌ను మంజూరు చేయాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురానికి చెందిన తోలెం హైమ ఐటీడీఏ పరిధిలో కంటెన్‌జెంట్ వర్కర్‌గా ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలంలో కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తుడుందెబ్బ నాయకుడు పొడెం బాబు పీఓకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
జూట్‌బ్యాగ్‌ల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ ట్రైనింగ్ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న జూట్‌బ్యాగ్‌ల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో జూట్‌బ్యాగ్‌ల తయారీపై 13రోజుల పాటు శిక్షణ ఇస్తారని వివరించారు. ట్రైనింగ్‌లో మధ్యాహ్న భోజనం, వసతి కల్పించడంతో పాటు ఉచితంగా టూల్ కిట్‌ను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కనీస విద్యార్హత 10వ తరగతి ఉండి 18నుంచి 45ఏళ్ల లోపు ఉన్న గిరిజన మహిళలు ఈ పథకానికి అర్హులని వివరించారు. తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగి కుట్టు మిషన్‌పై కొంత అనుభవం ఉన్న వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో ఈ నెల 27న సాయంత్రం 5గంటల లోపు ఐటీడీఏ కార్యాలయంలో అందించాలని పీఓ కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 8330954571లో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment