కేంద్ర బడ్జెట్‌లో ‘ఓరుగల్లు’కు కురిసేనా వరాల జల్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే 2025–26బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది?.. ఈసారైన కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల విషయమై కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.1.63 లక్షల కోట్లతో చేసిన ప్రతిపాదనల్లో ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలు అంశాలను చేర్చినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందాల్సిన వరంగల్‌కు ఈసారైన ప్రాధాన్యత దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌కు సంబంధించిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌లు ప్రకటించారు.
ఈ బడ్జెట్‌లోనైనా ప్రాధాన్యం ఇవ్వాలి
ప్రతిసారీ కేంద్ర బడ్జెట్‌లో వరంగల్‌కు అన్యాయం జరుగుతోంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాల్సి ఉంది. అలా అయితేనే పూర్తవుతుంది. కాజీపేటను రైల్వే డివిజన్‌గా చేయాలని కోరుతున్నా ఇప్పటికి నెరవేరడం లేదు. ఈసారి ప్రాధాన్యమివ్వాలి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడంలో ఆంధ్రాకు ప్రాధాన్యమిస్తున్న బీజేపీ తెలంగాణను పట్టించుకోవడం లేదు.
– కడియం కావ్య, ఎంపీ, వరంగల్
మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం..
వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలి. డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్ నిర్మాణానికి కేటాయింపులు చేయాల్సి ఉంది. మేం చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌పై చూపుతున్న ప్రేమ తెలంగాణపై చూపకపోవడం అన్యాయం. ఈ బడ్జెట్‌లో మంచి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.
– పోరిక బలరాం నాయక్, ఎంపీ, మహబూబాబాద్
రైల్వేలైన్లు, స్టేషన్ల అభివృద్ధిపై ఆశలు..
ఏళ్లు గడుస్తున్నా కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. కాజీపేటలో రైల్వే ఆక్ట్ అంప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్‌పైనా నాన్చివేత ధోరణి కొనసాగుతోంది. ఈ రెండింటిపై ఉద్యోగ, ప్రజా ఆందోళనలు తరచూ సాగుతున్నాయి. మణుగూరు – రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం బడ్జెట్ కేటాయించిన కేంద్రంలో భూసేకరణ, నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారన్న ఆశతో ఉన్నారు. హసన్‌పర్తి – కరీంనగర్, డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్‌లు మంజూరు కాగా.. సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం కేటాయింపులు చేయాల్సి ఉంది. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని చెప్పినా, సరిపడా నిధులు ఇవ్వడం లేదు. ఈ బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తే ఈ ఏడాది పూర్తవుతుందన్న నమ్మకం కలిగే అవకాశం ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్‌డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. స్టేషన్ ఘన్‌పూర్‌నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్ ప్రతిపాదన జరిగింది. సగం సర్వే అయింది. ఈ బడ్జెట్‌లో నిధులు ఇస్తే పూర్తి సర్వే జరిగి కొత్త లైన్‌కు శ్రీకారం జరుగుతుంది. ఇప్పటికై నా కాజీపేట జంక్షన్ నుంచి ముంబయి. విజయవాడ, కాగజ్‌నగర్ వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment