మోసపూరిత హామీలతో అధికారంలోకి.. | - | Sakshi
Sakshi News home page

మోసపూరిత హామీలతో అధికారంలోకి..

Published Mon, Apr 15 2024 12:45 AM | Last Updated on Mon, Apr 15 2024 12:45 AM

మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  - Sakshi

ఉప్పునుంతల/ వంగూరు: మోసపూరితమైన ఆరు గ్యారంటీల హామీతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆదివారం ఉప్పునుంతలలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పి రాజ్యాంగ నిర్మాతకు అరుదైన గౌరవం కల్పిస్తే.. నేటి పాలకులు ఆ మహనీయుడి జయంతి రోజున కనీసం విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానించడం తగదన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి పార్లమెంట్‌లో హిందూ కోడ్‌ బిల్లును ప్రవేశపెడితే, నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్‌ దందా వంటి మార్పు వచ్చిందే తప్ప.. పేదల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, సోషల్‌ మీడియా సమన్వయకర్త అభిలాష్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్తు భూపాల్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు కొత్త రవీందర్‌రావు, కట్టా గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా..

తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్‌లో పాలమూరు సమస్యలను ప్రస్తావిస్తానని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. వంగూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీతో పెద్ద ప్రమాదం ఉందని ఆ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని సైతం మార్చి పేదలకు అన్యాయం చేస్తారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనకు టీఎస్‌పీఎస్సీ పదవి ఇస్తానన్నా తాను ప్రజల మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలి

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement