జోగుళాంబ ఆలయంలో కార్తీక వైభవం
జోగుళాంబ శక్తిపీఠం: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర క్షేత్రం కార్తీక వైభవం సంతరించుకుంది. రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చిన భక్తులు తుంగభద్రనదిలో స్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్యకు తగ్గట్లు దేవప్థానం వారు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగారు. అలాగే బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ అర్చనలు చేశారు. ఇదిలాఉండగా, కార్తీకమాసాన్ని పురస్కరించుకొని దేవస్థానం వారు భక్తులకు దీపాలు, ప్రమిదెలు, నూనె వత్తులు ఉచితంగా అందజేశారు. ఆలయ ప్రాంగణంలో 21 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు చేసి దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా దీప కాంతులతో వెలుగొందాయి. అనంతరం మహిళలకు పసుపు, కుంకుమ, తాంబూలాలు అందజేశారు.
నదీమాతల్లికి దశవిధ హారతులు
ఇక నదీతీరంలో పుష్కర ఘాట్ దగ్గర గద్వాల వేదపండితుల చేత దశవిధ హారతులను నదీమతల్లికి అందజేశారు. ఏకహారతి, నేత్రహారతి, బిల్వ హరతి, వేద హారతి, కర్పూర పంచక హారతి, కుంభ హారతి, రతహారతి, చక్ర హారతి, నక్షత్ర హారతి, ధూప హారతులను అందజేశారు. నవబ్రహ్మ సాంస్కృతిక కళావేదిక ద్వారా ఆలయ ప్రాంగణంలో జోగుళాంబ కూచిపుడి కళాక్షేత్రం వారిచే చిన్నారులు కూచిపుడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆలయ ఈఓ పురేందర్‌కుమార్ చిన్నారులను అభినందించి ప్రశంసాప్రతాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment