భూ సేకరణే అడ్డంకి
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జలయజ్ఞంలో ప్రాజెక్టులు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. దీంతో వలసల జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఆశయానికి అడ్డంకిగా మారింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి.. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం.. ప్రాజెక్టులకు పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడిగా సాగుతున్న ఆయా ప్రాజెక్టుల పూర్తికి అవసమైన చర్యలు చేపడుతున్నారు. అసంపూర్తి పనులకు ప్రధాన సమస్యగా మారిన భూసేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీడు భూములకు సాగునీటిని పారించి వలసల జిల్లా వరస మార్చాలనే అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన దిశగా అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది.
నిరసనల నేపథ్యంలో..
సెప్టెంబర్ నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని జడ్చర్ల వద్ద భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగ తగిలాయి. దీంతో అసంపూర్తి పనులు పూర్తి చేయాలంటే భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. భూ సేకరణ ప్ర క్రియను ఆయా జిల్లాల కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షిస్తూ పరిష్కారం చూపాలని ఆదేశించారు. దీంతో భూ సేకరణ ప్రక్రియను కలెక్టర్లే పర్యవేక్షిస్తున్నారు.
ర్యాలంపాడుకు మరమ్మతు..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు జలాశయం ఈ ప్రాజెక్టుకు గుండెకాయవంటిది. అయితే రాక్‌టోల్, తూములు, ఆనకట్ట బండ్‌లో లీకేజీ ఏర్పడటంతో మూడేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ జలాశయం కింద ఒక పంట అంటే ఖరీఫ్‌లో మాత్రమే సాగునీరు అందిస్తున్నారు.
సివిల్, మెకానికల్ పనులు
పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు చేయాల్సి ఉంది. అలాగే పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణ చేపట్టాలి. ఉదండాపురంలో మంత్రులకు నిర్వాసితుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.
కేఎల్‌ఐ ఇలా..
నాగర్‌కర్నూల్ జిల్లాలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ రకాల కారణాలతో కేవలం రెండు పంపులు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన మూడు పంపులు మరమ్మతుకు గురై మూడేళ్లుగా మూలనపడ్డాయి. దీంతో రెండు పంపుల ద్వారానే 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే మిగిలిపోయిన 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా సాగులోకి వస్తుంది.
భీమాది అదే దారి..
నారాయణపేట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం అసంపూర్తిగా ఉండటంతో దాని కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించలేని పరిస్థితి.
ఏళ్ల తరబడిగా సా..గదీతకు ఇదే ప్రధాన కారణం
ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అసంపూర్తి పనులపై దృష్టి
తాజాగా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
భీమా, కల్వకుర్తి, పాలమూరుఎత్తిపోతలపై నిరంతర సమీక్ష
వచ్చే ఏడాది పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా అడుగులు
నెట్టెంపాడు.. 90 శాతం పూర్తి
సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 99వ ప్యాకేజీలో సుమారు 420 ఎకరాలకు సంబంధించి భూసేకరణ సమస్య అడ్డంకిగా మారింది. దీనిని జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ స్వయంగా పర్యవేక్షిస్తూ భూసేకరణ ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. పదేళ్ల కిందటే ప్రాజెక్టు కింద 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, పదేళ్లుగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ దుస్థితి నెలకొంది. అయితే పదేళ్ల కిందట ఈ ప్రాజెక్టులోని గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. వినియోగంలోకి వచ్చిన పంపుల నిర్వహణ సైతం పట్టించుకోకపోవడంతో మోటార్లలో సాంకేతిక సమస్య తలెత్తి మొరాయించడంతో నీటి పంపింగ్‌కు ఆటంకాలు తలెత్తడం పరిపాటిగా మారింది.
వేగవంతం చేశాం..
అసంపూర్తి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే భూ సేకరణకు అవసరమైన నిధుల కేటాయింపు, చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేశాం. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి అసంపూర్తి పనులు పూర్తి చేసి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. – శ్రీధర్, ఎస్‌ఈ,
గద్వాల జిల్లా సాగునీటి ప్రాజెక్టులు
Comments
Please login to add a commentAdd a comment