ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
నాగర్‌కర్నూల్ రూరల్/ కందనూలు: ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతోపాటు వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజు అన్నారు. జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న వారి శిబిరాన్ని గురువారం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఇంజినీర్లు, వైద్యులు, మేధావులుగా స్థాయిలో భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా ఏకశిల పార్క్‌లో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీకి పట్టుబడి ఉండాలని, ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకుపోవాలని విన్నవించారు.
● తాము చేస్తున్న సమ్మెకు అన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని, కానీ, ఒకే ఉపాధ్యాయ సంఘం ప్రోద్బలంతోనే సమ్మే చేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలు అవాస్తవమని జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళి తీవ్రంగా ఖండించారు. 2023లో ఇదే సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మే చేస్తుంటే వారికి మద్దతు తెలిపి సమ్మే విరమింపజేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు విష్ణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
లింగాల: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్శిక తనిఖీల్లో భాగంగా గురువారం అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేషన్‌లో నేరాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్‌లో సౌకర్యాల గురించి తెలుసుకొని.. పరిసరాలను పరిశీలించారు. నేరాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చట్టపరంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. ఎస్‌ఐ నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment