తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి శివారులో కురుస్తున్న మంచు
ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్లని మేఘాలు కమ్మేసుకున్నాయి. ఫలితంగా పొద్దస్తమానం సూరీడి జాడే కనిపించలేదు.. దీనికితోడు రోజంతా చల్లని గాలులు.. పొలిమెర ప్రాంతాల్లో మంచు, అక్కడక్కడ కురిసిన చిరుజల్లులతో జిల్లాలో గురువారం వాతావరణం ఒక వింత అనుభూతిని కలిగించింది..
రోజంతా చల్లని గాలులు వీయడంతో బయటికి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నల్లమలవాసులను చలిపులి మరింత ఉక్కిరిబిక్కిరికి చేస్తోంది. అయితే పాఠశాలలకు సెలవు ఉండటంతో విద్యార్థులు చలి నుంచి కొంత ఉపశమనం పొందినట్లయింది. – సాక్షి, నాగర్‌కర్నూల్
జిల్లాలో చల్లని గాలులతో పగటిపూట సైతం ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. జిల్లాలోని అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో గురువారం రాష్ట్రంలోనే రెండో అత్పల్ప స్థాయి ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో 18.6 డిగ్రీలు నమోదు కాగా.. ఆ తర్వాతి స్థానం వటవర్లపల్లిలోనే కావడం గమనార్హం. పగటిపూట సైతం సుమారు 20 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లావ్యాప్తంగా చలితీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
నల్లమల అటవీ ప్రాంతంలో..
జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంతోపాటు సమీప మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. పదర మండల కేంద్రంలో 19.5 డిగ్రీలు, అమ్రాబాద్‌లో 20.0, లింగాల మండలంలో 20.2 డిగ్రీల కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో రహదారులపై జనసంచారం తగ్గిపోయింది. ప్రజలు స్వెటర్లు, మంకీ క్యాపులతో బయటకు వస్తున్నారు. గ్రామాల్లో సాయంత్రం నుంచే చలిమంటలతో ప్రజలు సాంత్వన పొందుతున్నారు.
జాగ్రత్తలు అవసరం..
చలితీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి బయటకు పంపవద్దు. స్వెటర్లు, టోపీల ద్వారా చలి నుంచి రక్షణ కల్పించాలి. శరీరానికి వేడిని అందించే, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందించాలి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
– రాజేశ్‌గౌడ్, పిల్లల వైద్యుడు, నాగర్‌కర్నూల్
మండలం కనిష్ట ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
కొల్లాపూర్ 23.0
చారకొండ 23.0
పెంట్లవెల్లి 22.8
కోడేరు 22.8
పెద్దకొత్తపల్లి 22.7
తాడూరు 22.2
బిజినేపల్లి 21.7
నాగర్‌కర్నూల్ 21.5
తెలకపల్లి 21.4
బల్మూరు 21.4
ఊర్కొండ 21.2
ఉప్పునుంతల 21.2
తిమ్మాజిపేట 21.1
అచ్చంపేట 21.1
వంగూరు 21.0
కల్వకుర్తి 20.9
వెల్దండ 20.9
లింగాల 20.2
పదర 19.6
అమ్రాబాద్ 19.3
Comments
Please login to add a commentAdd a comment