పీజీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నాగర్‌కర్నూల్‌లో పీజీ సెంటర్ ఏర్పాటుకు పీయూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఎంపీ డా.మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాగర్‌కర్నూల్‌లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఏకం కావాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు నిండిన చారిత్రాత్మకమైన సందర్భంలో అన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఏకం కావాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. గురువారం సీపీఐ శత ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని బస్ డిపో నుంచి బస్టాండ్ కూడలీ వరకు వలంటీర్లు కమ్యూనిస్టు పార్టీ జెండాలతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగాదాయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కమ్యూనిస్టు పార్టీ పురుడు పోసుకుందన్నారు. నాటి నుంచి నేటి వరకు విప్లవ వీరుల ఉద్యమ పోరాటాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దేశ స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టు వీరులు రక్త తర్పణం చేశారన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుక్‌దేవ్, రాంప్రసాద్, బిస్మిల్లా, చంద్రశేఖర్ ఆజాద్, చంద్రరాజేశ్వర్‌రావు, రణధీర్, పీసీ జోషీ, ఇంద్రజిత్‌గుప్తా, ఏబీ వర్ధన్, సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి అనేక మంది ఉద్యమాన్ని బలోపేతం చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసువులుబాసిన అనేక మంది కమ్యూనిస్టు యోధులకు నివాళులర్పించారు. మారిన కాలానికి అనుగుణంగా కులం, మతం, మద్యం, సోషల్ మీడియా మత్తులో పడి యువత సమాజ స్పృహ కోల్పోయి పేరరిజం మోజులో పడ్డారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ శత ఆవిర్భావ వారోత్సవాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు వెంకటయ్య, ఫయాజ్, ఆనంద్‌జీ, కేశవులుగౌడ్, నాయకులు కృష్ణాజీ, రవీందర్, శ్రీనివాస్, లక్ష్మీపతి, కిరణ్, ప్రేమ్‌కుమార్, మధుగౌడ్, ఆజాద్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
తరలిన క్రీడాకారులు
కందనూలు: సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఉషూ క్రీడాకారులు గురువారం తరలివెళ్లారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో డీవైఎస్‌ఓ సీతారాం దగ్గరుండి పంపించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప్రతి క్రీడాకారుడు ప్రతిభచాటాలని, విజేతగా నిలిచి జిల్లాకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చీఫ్ మినిస్టర్ కప్ పోటీల్లో భాగంగా డిసెంబర్ 18న జిల్లాకేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో 10 మంది ఉషూ క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరు శుక్రవారం నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారని చెప్పారు. ఉషూ అసొసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖలీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment