ఆపరేషన్ స్మైల్
బాలకార్మికుల ఆపన్నహస్తం
●
పాఠశాలల్లో చేర్పిస్తున్నాం..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన బాలకార్మికులను సమీపంలోని పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. అంతే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. 18 ఏళ్లలోపు పిల్లలతో పనులు చేయించడం నేరం. పాఠశాలల్లో చేర్పించి, వదిలేయకుండా మూడు నెలలపాటు పర్యవేక్షణ చేస్తాం. జనవరి 1 నుంచి నెలరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
– శ్రీశైలం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
నాగర్‌కర్నూల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాన్నిస్తోంది. ఎంతో మంది బాలకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వివిధ కారణాలతో చదువుకోకుండా హోటళ్లు, కిరాణా షాపులు, ఇటుక బట్టీలు, బట్టల దుకాణాలు, బైక్ మెకానిక్‌ల వద్ద పనులు చేస్తూ బాలకార్మికులుగా మారిన పిల్లలకు వెట్టి నుంచి విముక్తి కల్పించేందుకు గాను ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చేపట్టింది. మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్, కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. 18 ఏళ్లలోపు బాలకార్మికులను గుర్తిస్తున్నారు. బాలల పరిస్థితుల మేరకు సమీపంలోని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2018 జనవరి నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతోంది. 2020 జూలై, 2021 జూలై నెలల్లో కరోనా ప్రభావం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 450 మంది బాలకార్మికులను గుర్తించి, వివిధ పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది బుధవారం నుంచి మరో విడత ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు ఆయా శాఖల అధికారులు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి, బాలకార్మికులను గుర్తించనున్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పిల్లలు పనుల్లో ఉంటే.. వారికి ఇక్కడే చదువులు చెప్పిండం లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి, వారి రాష్ట్రంలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. గుర్తించిన బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించిన తర్వాత వారిని అలాగే వదిలేయకుండా, వారి తల్లిదండ్రులతో బడులకు పంపేందుకు అంగీకార పత్రాలు కూడా రాయించుకుంటున్నారు. అదే విధంగా బాలల తల్లిదండ్రులకు బాలల హక్కులపై అవగాహన కల్పించి వారిని చదివించే విధంగా సూచనలు చేస్తున్నారు.
2018 నుంచి గుర్తించిన
బాలకార్మికుల వివరాలు ఇలా..
సంవత్సరం నెల గుర్తించిన
బాలకార్మికులు
2018 జనవరి 23
2018 జూలై 76
2019 జనవరి 29
2019 జూలై 46
2020 జనవరి 104
2021 జనవరి 48
2022 జనవరి 34
2022 జూలై 23
2023 జనవరి 16
2023 జూలై 18
2024 జనవరి 10
2024 జూలై 23
మొత్తం 450
వెట్టి చాకిరీ నుంచి విముక్తి
ప్రతి ఏటా జనవరి, జూలైలో
అధికారుల విస్తృత తనిఖీలు
2018 నుంచి ఇప్పటి వరకు 450 మంది బాలల గుర్తింపు
జిల్లాలో 13వ విడత ప్రారంభం
ఇప్పటి వరకు
450 మందికి విముక్తి..
Comments
Please login to add a commentAdd a comment