ప్రకృతి ఒడిలో.. | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో..

Published Mon, Jan 6 2025 7:36 AM | Last Updated on Mon, Jan 6 2025 5:16 PM

ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌

ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌

పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నల్లమలలోని టైగర్‌ సఫారీ

వారాంతాలు, సెలవు రోజుల్లో క్యూ కడుతున్న సందర్శకులు

నెల వ్యవధిలో రెండుసార్లు కనిపించిన పెద్దపులి

వన్యప్రాణులు తరుచుగా తారసపడుతుండటంతో ఆసక్తి

రెండు రకాల ప్యాకేజీలతో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం.. పట్టణ, నగర ప్రాంతాల్లో కరువైన స్వచ్ఛమైన గాలి.. ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్న ప్రజలు.. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్‌ స్టే ప్యాకేజీ, టైగర్‌ సఫారీ పర్యాటక ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. 

సాధారణ రోజుల కన్నా శని, ఆదివారాలు, సెలవు దినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్‌, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల నెలరోజుల వ్యవధిలోనే సఫారీ సందర్శకులకు రెండు సార్లు పెద్దపులి కనిపించడం విశేషం. దీంతో టైగర్‌ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్‌ సఫారీ కోసం మరింత మంది సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. 

– సాక్షి, నాగర్‌కర్నూల్‌/ మన్ననూర్‌

ఆక్టోపస్‌ వ్యూ పాయింట్‌

మ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో అటవీ అధికారులు టైగర్‌ సఫారీ ద్వారా పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్‌ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరుచుగా ఈ వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల డిసెంబర్‌ నెలలోనే సందర్శకులకు రెండుసార్లు పెద్ద పులులు కన్పించాయి. ఎలుగు బంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్‌ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్‌ సఫారీ ట్రిప్‌ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్‌ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.

ప్రత్యేక ఆకర్షణగా వ్యూ పాయింట్లు..

టైగర్‌ సఫారీలో భాగంగా సందర్శకులను ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ వరకు తీసుకెళ్తారు. ఈ వ్యూపాయింట్‌ నుంచి రుషుల చెరువు, దట్టమైన అరణ్యం చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిలో ఉన్న ఆక్టోపస్‌ వ్యూపాయింట్‌ శ్రీశైలం వెళ్లే యాత్రికులను అమితంగా ఆకర్షిస్తోంది.

దట్టమైన అడవిలో..

అడవి అందాలను ఆస్వాదిస్తూ 24 గంటల పాటు నల్లమలలో గడపాలనుకునే ప్రకృతి ప్రేమికుల కోసం అటవీశాఖ టైగర్‌ స్టే ప్యాకేజీ అందిస్తోంది. దట్టమైన అడవిలో సుమారు 20 కి.మీ., టైగర్‌ సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించవచ్చు. మన్ననూర్‌లోని వనమాలికలో సందర్శకులకు ప్రత్యేక కాటేజీల్లో వసతి కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో సఫారీ టూర్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ.4,500 నుంచి రూ.8 వేల వరకు మడ్‌ హౌస్‌, చెంచుహట్‌, ట్రీహౌస్‌ తదితర ప్రత్యేకమైన కాటేజీలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో రెండు రోజుల పాటు సఫారీ టూర్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మన్ననూరులోని సీబీఈటీలో బయోల్యాబ్‌, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కేంద్రం సందర్శన, అడవి, వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చేపడుతున్న చర్యలపై అవగాహన కల్పిస్తారు. సాయంత్రం టైగర్‌ సఫారీ, మరుసటి రోజు ఉదయం అడవిలో పక్షుల సందడిని వీక్షించేందుకు వీలుగా ప్రతాపరుద్రుని కోట వరకు ట్రెక్కింగ్‌ ఉంటుంది. అనంతరం ఉమామహేశ్వర క్షేత్రం దర్శనంతో సఫారీ టూర్‌ ముగుస్తుంది. సఫారీ టూర్‌ కోసం పర్యాటకులు www. amra badtigerreserve. com వెబ్‌సైట్‌ను సందర్శించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement