పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత
పెంట్లవెల్లి: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగా అటవీశాఖ పరిధిలో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి గతంలో మంత్రుల బృందం పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం ఆయన మల్లేశ్వరం, అమరగిరి వద్ద కృష్ణానది బ్యాక్ వాటర్‌లో టూరిజం లాంచ్‌లో పర్యటించి ఐలాండ్, నల్లమల అటవీ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఆహ్లాదం అందించడానికి ఎకో పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మల్లేశ్వరం ఐలాండ్ ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా గుర్తించారని, ఇక్కడ అన్నిరకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషిచేస్తామన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో జిల్లాలోని పలు సందర్శనీయ స్థలాలను సైతం పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. తద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, స్థానిక ప్రజల జీవన స్థితిగతులు కూడా ఆర్థికంగా మెరుగుపడతాయని చెప్పారు. కలెక్టర్ వెంట కొల్లాపూర్, పెంట్లవెల్లి తహసీల్దార్లు విష్ణువర్ధన్‌రావు, జయంతి, టూరిజం జిల్లా అధికారి నర్సింహ, నాయకులు నర్సింహాయాదవ్, బాలరాజు, శేఖర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment