పేదల సంక్షేమానికి పెద్దపీట
అచ్చంపేట: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 26 నుంచి సాగు చేస్తున్న రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఊహాగానాలు, అంచనాలకు అందని విధంగా సాగు భూమికి రైతుభరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, రేషన్ కార్డులు ఇచ్చే నిర్ణయం తీసుకోవడంతో అన్నివర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుందని, ఇళ్లు లేని పేదలకు నిర్మించే బృహత్తర పథకం కొనసాగుతుందని తెలిపారు. కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రక్రియ మొదలైందన్నారు. కొత్త మండలాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు, ఉగాది నాటికి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ.500 బోనస్, అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలో మాఫీ వర్తింపజేస్తుందని వివరించారు. సీఎం త్వరలో నియోజకవర్గాల పర్యటన చేయనున్నారని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత, నర్సింహారావు, గోపాల్‌రెడ్డి, కట్టా అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, జగత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment