కల్వకుర్తి మార్కెట్‌కు భారీగా వేరుశనగ | - | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి మార్కెట్‌కు భారీగా వేరుశనగ

Published Mon, Jan 6 2025 7:36 AM | Last Updated on Mon, Jan 6 2025 7:36 AM

కల్వక

కల్వకుర్తి మార్కెట్‌కు భారీగా వేరుశనగ

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఆదివారం 1,969 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టంగా రూ.6,900, కనిష్టంగా రూ.5,680, సరాసరి ధర రూ.6,670 ధర లభించింది. అలాగే కంది 29 క్వింటాళ్లు రాగా.. గరిష్టంగా రూ.7,060, కనిష్టంగా రూ.6,410, సరాసరి ధర రూ.7,060 ధరలు పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి భగవంతు తెలిపారు.

నేడు మార్కెట్‌ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

నాగర్‌ కర్నూల్‌ రూరల్‌: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు కొత్త మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా. రాజేశ్‌రెడ్డి, డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మార్కెట్‌యార్డులో కార్యక్రమం ఉంటుందని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మైసమ్మ జాతరకు

తగ్గిన భక్తుల రద్దీ

పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శంచుకొని మొక్కులు తీర్చుకున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు యాసంగి వరినాట్లలో నిమగ్నం కావడంతో కేవలం 4 వేల మంది మాత్రమే అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల సంఖ్య కూడా తగ్గించింది. కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, వనపర్తి ఒక్కో డిపో నుంచి 4 బస్సుల మాత్రమే నడిపారు. కార్లు, జీపులు, ఆటోలు, ట్రాక్టర్లు, మోటారుసైకిళ్లపైన వచ్చి భక్తులు మైసమ్మ దేవతకు నైవేద్యాలు సమర్పించుకున్నారు.

దర్శించుకున్న వనపర్తి ఎమ్మెల్యే

మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్‌ బుడుగు శ్రీనివాస్‌యాదవ్‌, సిబ్బంది ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే మైసమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట పెద్దకొత్తపల్లి ఎస్‌ఐ సతీష్‌, కో–ఆప్షన్‌ మాజీ సభ్యుడు ఎండీ సలీం, అధికారులు ఉన్నారు.

ఊర్కొండపేట ఆలయ ధర్మకర్తల మండలి ఎన్నిక

ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని ఎన్నుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ఊర్కొండపేటకు చెందిన తిర్మని బొందయ్యగౌడ్‌, మొండేళ్ల రమేష్‌, గుండెమోని మల్లేష్‌, అమరచింతల వెంకటమ్మ, రాచాలపల్లికి చెందిన సత్యనారాయణరెడ్డి, కాల్యతండాకు చెందిన గోపాల్నాయక్‌, ఠాకూర్తండాకు చెందిన రమావత్‌ పత్యానాయక్‌, గుండ్లగుంటపల్లికి చెందిన నెల్లికొండ రజిత, ఊర్కొండకు చెందిన విజేందర్‌, ముచ్చర్లపల్లికి చెందిన ధార బంగారయ్య, గుడిగానిపల్లికి చెందిన చిదిరె ఆంజనేయులు, జకినాలపల్లికి చెందిన జి.వెంకటయ్య, ప్రధాన అర్చకులుగా ఊర్కొండకు చెందిన మహేష్‌ ఎన్నికయ్యారని చెప్పారు. ఈ కమిటీ ఏడాది పాటు కొనసాగనున్నట్లు వివరించారు.

వైజ్ఞానిక ప్రదర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు

జడ్చర్ల/ జడ్చర్ల టౌన్‌: పోలేపల్లి శివారు ఎస్‌వీకేఎం పాఠశాలలో మంగళవారం నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ అన్నారు. ఆదివారం రాత్రి డీఈఓ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఎస్‌వీకేంలో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు, ఉపాద్యాయులు కలిసి దాదాపు 2,500 మంది ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే 861 ప్రయోగ ప్రదర్శనలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, భోజనాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చాలన్నారు. పార్కింగ్‌, విడిది చేసే స్థలాల నుంచి ప్రదర్శన కేంద్రానికి వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సోమవారమే విద్యార్థులు, ఉ పాధ్యాయులు కేంద్రానికి చేరుకుంటారని, వారికి అల్పాహారం, భోజనం ఏర్పాటు చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కల్వకుర్తి మార్కెట్‌కు భారీగా వేరుశనగ 
1
1/1

కల్వకుర్తి మార్కెట్‌కు భారీగా వేరుశనగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement