చెంచుపెంటలలో వసతుల కల్పనకు కృషి
వీసీలో మాట్లాడుతున్న
కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: జిల్లాలోని చెంచు పెంటల్లో నివశిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషిచేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ వివరించారు. నల్లమల ప్రాంత చెంచు పెంటల్లో నివశించే చెంచుల జీవన స్థితిగతులు, ఆర్థిక జీవన విధానంలో సమూల మార్పు లు తీసుకురావడానికి గవర్నర్ దత్తత తీసుకున్న చెంచుపెంట గ్రామాల చెంచు ప్రజలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల నిధులతో అవసరమైన వనరులు సమకూరుస్తున్నానమి, ఆర్థికంగా, విద్యాపరంగా వారి కుటుంబాలను మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం సమష్టిగా ముందుకెళ్తుందన్నారు. 2022లో మన్ననూర్ మండలం అప్పాపూర్ పెంట పంచాయతీ పరిధిలోని రాంపూర్ పెంట, అప్పపూర్ పెంట, భౌరాపూర్, మల్లాయపల్లి, పుల్లయ్యపల్లి, మేడిమల్కల, సంగిడి, గుండాల పెంటలను గవర్నర్ దత్తత తీసుకున్నారని, ఈ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ప్రధానంగా సోలార్ వీధిలైట్ల ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. చెంచుపెంటలలోని బాల, బాలికల కోసం అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతుతోపాటు పాఠశాలల అభివృద్ధి చేపట్టామని, విద్యా ప్రాధాన్యత దృష్ట్యా మొబైల్ స్కూల్ ఏర్పాటు చేశామని చెప్పారు. చెంచుల వ్యవసాయ అవసరాల కోసం రోడ్డు మార్గాలు మెరుగుపరిచామని, చెక్‌డ్యాం నిర్మాణాల ద్వారా నీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని, రాంపూర్ పెంటలో బావి నిర్మాణం పూర్తిచేశామన్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం పశుసంపద, పెరటి కోళ్ల పెంపకం, అటవీ ఉత్పత్తులు తేనె, ఔషధ మొక్కలు తదితర వాటి కోసం కిరాణ దుకాణాల నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు. చెంచు ప్రజల సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment