క్లస్టర్ల వారీగా పంటల నమోదు
అచ్చంపేట: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.12 వేల పెట్టుబడి సాయంగా అందించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాగు భూమినే రైతు భరోసా పథకం అమలుకు ప్రాతిపదికగా తీసుకోనుంది. గత ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి భూమికి ఎకరాకు రూ.5 వేల చొప్పున వానాకాలం, యాసంగిలో కలిపి రూ.10 వేల రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించింది. ఈ ప్రక్రియలో సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, గతేడాది 2024 జనవరిలో గత ప్రభుత్వం మాదిరిగానే ఎకరాకు రూ.5 వేల చొప్పున జిల్లాలోని 3.06 లక్షల మంది రైతులకు రూ.369.21 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. ఆ తర్వాత వానాకాలం సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో రైతులు నిరాశ చెందారు.
అక్రమ లే అవుట్లు
జిల్లాలో సాగులో లేని భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ప్రధాన గ్రామాలు, మండల కేంద్రాలతోపాటు నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ పట్టణాల శివారులో ఉన్న వ్యవసాయ భూముల్లో నివాస గృహలు నిర్మాణమయ్యాయి. స్థిరాస్తి వ్యాపారులు వ్యవసాయ భూములను వ్యవసాయేతరగా (నాలా) మార్చుకుండానే అక్రమ లే అవుట్లను చేశారు. ఇలాంటివి వ్యవసాయ భూములుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉన్నా యి. దీంతో సదరు వ్యక్తులకు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతూ వచ్చాయి. ఈసారి మాత్రం ప్రభుత్వం ఇలాంటి భూములకు రైతు భరోసా కింద డబ్బులు జమ చేసే అవకాశం ఉండదు.
30 వేల పైచిలుకు..
కౌలు రైతులకు సంబంధించి మాత్రం ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించలేదు. సాగు భూములకు రైతు భరోసా, భూమి లేని కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కౌలు రైతులను విస్మరించింది. జిల్లాలో 30 వేల పైచిలుకు కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. వీరు అర ఎకరా, ఎకరా ఉన్న పేదలు, ఇతరుల భూములు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
నిగ్గు తేలేది ఇలా..
రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం సాగులో లేని భూముల లెక్క తేల్చేందుకు సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారం చేసుకోనుంది. వీటి ద్వారా ఏయే గ్రామాల్లో ఎంత భూమి సాగు అవుతుంది.. ఎంత భూమి నిరుపయోగంగా ఉంది.. గుట్టలు, సాగుకు యోగ్యం కాని భూముల లెక్కలు నిగ్గు తేల్చనున్నారు.
అచ్చంపేట శివారులో సాగు చేసిన
వేరుశనగ పంట
సర్వే చేస్తున్నాం..
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో క్టస్టర్ల వారీగా పంటల సర్వే కొనసాగుతుంది. పంటల సాగు, ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుంది.
– చంద్రశేఖర్,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
శాటిలైట్ మ్యాపింగ్‌తో తేలనున్న సాగు వివరాలు
ఇప్పటికే పొలాల బాట పట్టిన వ్యవసాయాధికారులు
పైలెట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
కౌలు రైతుల ఊసెత్తని ప్రభుత్వం
సర్వేకు సంబంధించిన యాప్ అందుబాటులోకి వచ్చిన అనంతరం క్షేత్రస్థాయిలో పంటల వివరాలు విధి విధానాల ప్రకారం నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సర్వే జరుగుతోంది. జిల్లాలో యాసంగి పంటల సాగు యాప్‌లో కాకుండా ప్రస్తుతం క్లస్టర్ల వారీగా రైతులు ఏయే పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు నమోదు చేస్తున్నారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఈ నెల 26 నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆగమేఘాల మీద వ్యవసాయ శాఖ అధికారులు పొలాల బాట పట్టారు. పంట సాగు చేయని సర్వే నంబర్, దాని విస్తీర్ణం వంటి అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment