ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి విద్యార్థి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులు, వైద్యులకు పాఠశాల ఆరోగ్యం, శ్రేయస్సుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థుల జీవన శైలిపై పలు అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్న కారణంగా పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, స్వస్థత అనేవి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు.
పాఠశాల విద్యార్థులకు మానసిక, శారీరిక, ఆరోగ్యం పట్ల సమగ్ర అవగాహన కల్పించి అవసరమైన ఆలంబన, సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, శ్రేయస్సు కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు చిన్న సమస్యలకే కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని, తోటి వారి ఒత్తిడి వల్ల పొగాకు, మద్యం తాగున్నారని, పౌష్టికాహారం తీసుకోకుండా అనారోగ్యకరమైన చిరుతిళ్లు ఎక్కువగా తీసుకుంటున్నారన్నారు. ఎక్కువగా ఫోన్‌తోపాటు ఇంటర్‌నెట్ వినియోగిస్తుండటంతో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ కనబరిచేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment