విద్య, వైద్యరంగాలకు పెద్దపీట
జడ్చర్ల/జడ్చర్ల టౌన్: ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందేనని.. అందులో తమ ప్రభుత్వం ముందుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులోని ఎస్‌వీకేఎంలో విద్యాశాఖ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆవిష్కరణలు తనను ఎంతో అబ్బురపరిచాయన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించాలని, ఆ ఆలోచనల నుంచే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందించడంతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నారు. వీటికి తోడు ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఉండాలన్నారు. గురుకులాలు, పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. తాను బాలికా విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తానన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు సంస్కారాన్ని అందించాలని, మంచి సమాజానికి ఇవ్వాలన్న భావన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యనే కాదు సంస్కారవంతుడిని కావాలని, నా వంతు కృషి, నా బాధ్యత అన్న ఆలోచనలు పిల్లల్లో పెంపొందించాలన్నారు. ఎన్‌సీఆర్టీ, ఎస్‌సీఆర్టీల సంయుక్త ఆధ్వర్యంలో మండల, జిల్లాస్థాయి ప్రదర్శనలను ముగించుకుని విజయవంతంగా 836 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి తీసుకురావడంపై అభినందనలు తెలిపారు. రాష్టస్థాయి ప్రదర్శనలకు జాతీయస్థాయిలో తప్పనిసరిగా గుర్తింపు వస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
మరిన్ని వివరాలు 8లో u
Comments
Please login to add a commentAdd a comment