సావిత్రిబాయి ఆశయ సాధనకు కృషి
నాగర్‌కర్నూల్: సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం శ్రమించిన సావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన ఘనమైన నివాళి అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారికంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్ర విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. కుల వ్యవస్థ, పితృస్వామ్యం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శం అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పుణెలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సమష్టిగా పోరాటం చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి ఆశయాల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని పేర్కొన్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రీబాయి ఆశయాల సాధనకు మహిళా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల వృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు. డీఈఓ రమేష్‌కుమార్ మాట్లాడుతూ సీ్త్ర విద్యాభివృద్ధికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించామని చెప్పారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈఓలు శాలువాతో సత్కరించారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కీర్తన సావిత్రిబాయి పూలే వేషధారణతో ఆకట్టుకోగా కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment