డిండి నిర్వాసితులను ఆదుకుంటాం
చారకొండ: డిండి నార్లాపూర్ లిఫ్టు ఇరిగేషన్‌లో భూములు కోల్పోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మండలంలోని కమాల్‌పూర్ పంచాయతీ నూకలచింతవాడికతండాలో డీఎల్‌ఐ కాల్వ అలైన్‌మెంట్‌ను శుక్రవారం ఆయన పరిశీలించి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అలైన్‌మెంట్‌ను పరిశీలించడంతో తండా రైతులు తమ వ్యవసాయ భూములు కోల్పోతున్నామని తమను ఆదుకోవాలని వేడుకున్నారు. గత ప్రభుత్వం తండాలో డీఎల్‌ఐ లిఫ్టు ఇరిగేషన్‌లో 42 ఎకరాలు అలైన్‌మెంట్ చేసి, రైతులకు రూ.5.50 లక్షల నష్టపరిహారం అందించిందన్నారు. ఈ పరిహారంతో ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయామని, ప్రస్తుతం అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ విషయమై స్పందిస్తూ రైతులు నష్టపోకుండా వీలైనంత తక్కువ పొలాలు నిర్మాణంలో పోయేలా అలైన్‌మెంట్ మారుస్తామని, నష్టపోయిన రైతులకు మరింత ఎక్కువ నష్టపరిహారం అందేలా కృషిచేస్తానన్నారు. అక్కడి నుంచే ఎమ్మెల్యే ఇరిగేషన్ ఏఈ, డీఈలతో ఫోన్‌లో మాట్లాడి రైతులు నష్టపోకుండా అలైన్‌మెంట్‌ను మరోసారి చేపట్టాలని సూచించారు. అనంతరం తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ గన్యానాయక్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
ఎమ్మెల్యే వంశీకృష్ణ శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ డేరం రామశర్మతో కలిసి ఆలయ ప్రాంగణంలో సామూహిక మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఆర్‌ఐ భరత్, సింగిల్ విండో చైర్మన్ గుర్వయ్యగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకట్‌గౌడ్, భీముడునాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, నాయకులు లక్ష్మణ్, శంకర్‌గౌడ్, జైపాల్, శ్రీపతిరావు, సహదేవ్, దశరథం, భీమదాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment