రసాభాసగా మున్సిపల్ సమావేశం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి అంశాలను ఎజెండాలో చేర్చి వాటి గురించి చర్చించి ఆమోదించేందుకు నిర్వహించే నాగర్‌కర్నూల్ మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చించాల్సిన కౌన్సిలర్లు తమకు రావాల్సిన బిల్లుల గురించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీనితో మున్సిపల్ సమావేశం కాస్త గందరగోళంగా మారింది. మరో 20 రోజుల్లో మున్సిపల్ పాలకవర్గం ముగిసిపోతుండడంతో ప్రధానంగా బిల్లుల అంశంపైనే దృష్టిపెట్టారు. ఎజెండాలో 21 అంశాలను చేర్చి వాటిపై చర్చించి ఆమోదించాల్సి ఉండగా దాదాపు రెండు గంటలకు పైగా చర్చను పక్కదారి పట్టించారు. చివరకు రూ.2.70 కోట్ల నిధులతో వైకుంఠ రథం, రెండు ట్రాక్టర్లు, పది ఆటోల కొనుగోలు వంటి వాటిని టేబుల్ ఎజెండా కింద ప్రతిపాదనలు పెట్టి ఆమోదించారు. ఇక సిబ్బంది జీతాల విషయంలోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా చెల్లిస్తున్నారని, గతంలో పెంచుతామని చెప్పినా ఇప్పటికీ వాటి ఊసే లేదని సమావేశం దృష్టికి తీసుకురావడంతో జీఓ ప్రకారం సిబ్బంది అందరికీ ఎంత జీతం రావాలో అంత వేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment