ఊపిరి ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాడతాం
బల్మూర్: ఊపిరి ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాడతామని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి అన్నారు. ఉమామహేశ్వర రిజర్వాయర్‌లో భూములు కోల్పోనున్న బల్మూర్, అనంతవరం గ్రామాలకు చెందిన రైతులతో సోమవారం మండల కేంద్రంలో సమావేశమై మాట్లాడారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణంతో సుమారు 2,200 ఎకరాల భూములు ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వ భూములైన అటవీ ప్రాంతంలోని రామగిరి, రుసుల చెరువు, కొత్త చెరువులను తక్కువ టీఎంసీ అంచనాలతో రిజర్వాయర్లుగా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పేద రైతులు భూములు కోల్పోకుండా ఉంటారన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే రైతుల పక్షాన ఉండాలన్నారు. గతంలో పాలమూరు జిల్లాకు కృష్ణా జలాల కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందన్నారు. రైతులంతా ఏకమై రామగిరి, రుసుల చెరువు, కొత్త చెరువులను రిజర్వాయర్లుగా నిర్మించేందుకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వెంటనే ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాల అనుమతులను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో రిజర్వాయర్ భూ నిర్వాసిత పోరాట సమితి అధ్యక్షుడు సీతారాంరెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు బాలస్వామి, ఇంద్రారెడ్డి, నాగయ్య, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment