మాతృ మరణాలను నివారిద్దాం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో మాతృ మరణాలను నివారించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ మాతృ మరణాలు సంభవించకుండా చూడాలన్నారు. హైరిస్క్ కేసులను కమ్యూనిటీ, జనరల్ ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఇటీవల తాడూరు, బొప్పెల్లి, పదర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన మాతృమరణాలపై వైద్యాధికారులతో వివరాలు సేకరించి.. మరోమారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు గర్భిణులకు రక్తపోటు, హిమోగ్లోబిన్, గ్లూకోజ్ స్థాయి పరీక్షలు చేయాలని తెలిపారు. గర్భిణిలో ఏమైనా ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే సుఖ ప్రసవం జరిగే వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.వెంకటదాసు, జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ డా. రామకృష్ణ, అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రభు, డా.తారాసింగ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment