రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
కల్వకుర్తి టౌన్: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాఽథ్‌తో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డ్రైవింగ్‌లో అజాగ్రత్త, అతివేగంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాహనదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాహనాలు నడుపుతున్నారని అన్నారు. రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి చిన్నబాలు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, కల్వకుర్తి ఎంవీఐ అశోక్‌కుమార్, సీఐలు నాగరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌ఐలు మాధవరెడ్డి, రాంచందర్‌జీ, మహేందర్, కురుమూర్తి, షంషొద్దీన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment