గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఆయా శాఖల సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు ముఖ్య ప్రణాళికాధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా సమగ్ర సమాచారంతో గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికలను తయారు చేయాలని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. శాఖల వారీగా చేపట్టబోయే కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వ శాఖల ఆద్వర్యంలో శకటాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్యారోగ్యశాఖ 108 అంబులెన్స్‌ను సిద్ధం చేసుకోవడంతో పాటు వైద్యశిబిరం నిర్వహించాలని.. జిల్లా విద్యాశాఖ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment