
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ టికెట్లు పాత అభ్యర్థులకే దక్కాయి. సీఎం గతంలో చెప్పినట్లుగా సిట్టింగ్‌లకే మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొన్ని నియోజకవర్గల్లో సొంత పార్టీ నుంచే అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉన్నా అవేమీ పట్టించుకోకుండా పాత వారికే టికెట్లను కేటాయించారు. సోమవారం అభ్యర్థుల ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీలో ఉంటే అవకాశాలు వస్తాయని చెప్పారు.
ఫిర్యాదులను పట్టించుకోకుండా..
ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సిట్టింగ్‌లకు టికెట్లు ఇస్తే తాము పనిచేయబోమని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా సీఎం కేసీఆర్ అవేమీ పట్టించుకోకుండా పాతవారికే టికెట్లు ఖరారు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌పై దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్ తదితర నేతలు ఇటీవల మంత్రి హరీష్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని స్పష్టంగా చెప్పారు.
నియోజకవర్గంలో నాయకులను పట్టించుకోరని, ఏకపక్ష పోకడలు ఉంటాయని, ఈసారి మరొకరికి టికెట్ ఇవ్వాలని కోరారు. డిండిలోనూ సమావేశం పెట్టుకొని రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని తీర్మానించారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా స్థానికంగా పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని నియోజకవర్గ నేతలు శశిధర్‌రెడ్డి వర్గం నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి తీర్మానం కూడా చేశారు.
నాగార్జునసాగర్‌లో హాలియా, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ కోటిరెడ్డి చెరొకటి తమ అనుచరులకు ఇచ్చుకుందామని ప్రతిపాదన పెట్టినా ఎమ్మెల్యే భగత్ అందుకు ఒప్పుకోలేదని, రెండు చోట్ల తన వర్గం వారినే చైర్మన్లుగా నియమించుకున్నారనే కోపంతో ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం ఎమ్మెల్యే వర్గాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తాను మొదట చెప్పిన విధంగానే సిట్టింగ్‌లకే టికెట్లను ప్రకటించారు.
పార్టీలో ఉంటేనే అవకాశాలు
బీఆర్‌ఎస్ పార్టీ విశాలమైందని, ఎమ్మెల్యే టికెట్ ఒక్కటే కాదు పార్టీలో ఉంటే ఎన్నో అవకాశాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. అందరూ కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పనిచేసుకుంటూ పోతే అవకాశాలు వస్తాయని, ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆగం కావొద్దని సూచించారు. అయితే, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున అసమ్మతిని తొలగించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తే అసమ్మతి నేతలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.
పోటీలో ఉండే అభ్యర్థులు వీరే..
సూర్యాపేట – మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
తుంగతుర్తి – గాదరి కిషోర్‌కుమార్
కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్
హుజూర్‌నగర్ – శానంపూడి సైదిరెడ్డి
నల్లగొండ – కంచర్ల భూపాల్‌రెడ్డి
మిర్యాలగూడ – నలమోతు భాస్కర్‌రావు
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
మునుగోడు – కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నాగార్జునసాగర్ – నోముల భగత్
దేవరకొండ – రమావత్ రవీంద్రకుమార్
ఆలేరు – గొంగిడి సునీత
భువనగిరి – పైళ్ల శేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment