కేసీఆర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం

Published Sat, Apr 20 2024 1:45 AM

- - Sakshi

ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానం కూడా గెలవదని.. ఆ పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కనీస న్యాయం జరగలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 15 ఎంపీ స్థానాలు దక్కుతాయని, నల్లగొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పేటలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కె.రఘువీర్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్‌, శంకర్‌నాయక్‌, ఏఐసీసీ మెంబర్‌ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌, తండు శ్రీనివాస్‌యాదవ్‌, చకిలం రాజేశ్వర్‌రావు, కొప్పుల వేణారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement