డిండి విత్తనోత్పత్తి క్షేత్రంలో 24న కందుల వేలం | - | Sakshi
Sakshi News home page

డిండి విత్తనోత్పత్తి క్షేత్రంలో 24న కందుల వేలం

Published Sun, Oct 20 2024 2:46 AM | Last Updated on Sun, Oct 20 2024 2:46 AM

డిండి విత్తనోత్పత్తి క్షేత్రంలో 24న కందుల వేలం

నల్లగొండ టౌన్‌: డిండి, చెరుకుపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో వానాకాలం–2023 సీజన్‌లో పండించిన కందులను ఈ నెల 24వ తేదీన వేలం వేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు డిండి విత్తనోత్పత్తి క్షేత్రంలో కందులను వేలం వేస్తామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలిచిన వారు రూ.10 వేల ధరావత్‌ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

కేజీబీవీల్లో ఖాళీ పోస్టులు భర్తీ

నల్లగొండ: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక అధికారిణి, పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీ పోస్టులను శనివారం 1:1 పద్ధతిన ఇంటర్వ్యూకు భర్తీ చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న మొత్తం 54 మందికి గాను 50 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరిని మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర, డీఈఓ బొల్లారం భిక్షపతి, జీఈసీఓ పి.సరిత పాల్గొన్నారు.

రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక

నల్లగొండ టూటౌన్‌: ఈ నెల 21న నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో ఉదయం 9 గంటలకు అండర్‌–13, 14 ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సయ్యద్‌ అమీనొద్దీన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌ ఫొటోలతో రావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌: 98857 17996 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

22, 23 తేదీల్లో తైక్వాండో, కబడ్డీ క్రీడాకారుల ఎంపిక

నల్లగొండ రూరల్‌: అంతర్‌ యూనివర్సిటీ క్రీడా పోటీలకు ఎంజీయూ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఈ నెల 22, 23న యూనివర్సిటీ క్యాంపస్‌లో కబడ్డీ, తైక్వాండో క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు క్రీడల కార్యదర్శి హరీష్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22న తైక్వాండో, 23న కబడ్డీ క్రీడాకారులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 17 నుంచి 25 సంవత్సరాల్లోపు ఉన్న డిగ్రీ, పీజీ విద్యార్థులు హాజరు కావొచ్చని తెలిపారు.

ఐటీఐ కళాశాలల్లో 30 వరకు అడ్మిషన్లు

నల్లగొండ: 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా ఐటీఐల కన్వీనర్‌, నల్లగొండ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.నర్సింహాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలలోగా iti.telang ana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని అన్‌ప్రింటెడ్‌ కాపీ, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

చండూరు హెచ్‌ఎంపై విచారణకు ఆదేశం

నల్లగొండ: లైంగిక వేధింపుల ఆరోపణలపై చండూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భిక్షంపై జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి విచారణకు ఆదేశించారు. హెచ్‌ఎం భిక్షం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే మహిళలు శనివారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లగొండలో డీఈఓ భిక్షపతిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ పట్ల హెచ్‌ఎం అసభ్యకరంగా ప్రవర్తించారని, అతడిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల ఫిర్యాదుకు స్పందించిన డీఈఓ వెంటనే విచారణకు ఆదేశించారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. కల్యాణతంతు పూర్తి చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement